iDreamPost

వరద బాధితులకు అండగా సీఎం జగన్‌.. ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ

  • Published Jul 31, 2023 | 12:39 PMUpdated Jul 31, 2023 | 12:39 PM
  • Published Jul 31, 2023 | 12:39 PMUpdated Jul 31, 2023 | 12:39 PM
వరద బాధితులకు అండగా సీఎం జగన్‌.. ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ

గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేని వానలు.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో​ పెద్ద ఎత్తన వరదలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సీఎం జగన్‌ సర్కార్‌ అన్ని విధాలుగా చేయూత అందిస్తోంది. తక్షణ సాయం కింద 12 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడమే కాక.. వరదల వల్ల ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసేందుకు రంగంలోకి దిగి అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులు, ఆ జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పునరావాస ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు పునరావాస, సహాయక కార్యకలాపాలు పక్కాగా అమలవుతున్నాయి.

216 గ్రామాలకు వరద ముంపు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 216 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఆ గ్రామాల నుంచి 52,753 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 48,345 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. వరద తగ్గిన తర్వాత బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ.1000- రూ. 2 వేల ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేయడంతో.. అధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు పంపిణీ కోసం ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉత్వర్వులు జారీచేసింది.

అంతేకాక వరద బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్‌ పామాయిల్‌ అందజేస్తున్నారు. ఐదు వరద ప్రభావిత జిల్లాల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమత్తు చేసుకునేందుకు అందించే పరిహారాన్ని కూడా 10 వేల రూపాయలకు పెంచారు సీఎం జగన్‌. గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే ఉండేది.

సహాయక చర్యల్లో కీలకంగా వాలంటీర్లు..

వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సరఫరా పథకాలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఇప్పటికే పునరుద్ధరించారు. ఆ గ్రామాల్లో పారిశుధ్యం దిగజారకుండా బ్లీచింగ్‌ చల్లడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. గ్రామ వలంటీర్లు వరద సహాయక చర్యల్లో చురుగ్గా పనిచేస్తూ స్థానికంగా ఉన్న పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారమిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచే గ్రామాల వారీగా సహాయక చర్యలు జరుగుతున్న తీరును కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి