iDreamPost

అంతులేని అణు విషాదం.. చెర్నోబిల్ ప్రమాదం

అంతులేని అణు విషాదం.. చెర్నోబిల్ ప్రమాదం

గత తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న సైనిక చర్య మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో లేదో తెలియదు గానీ.. రష్యా దాడుల తీరు చూస్తుంటే ప్రపంచం.. ముఖ్యంగా యూరప్ దేశాలు మరో పెను అణు ముప్పు ముంగిట నిలిచిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధంలో భాగంగా అణు విద్యుత్ ప్లాంట్లపై రష్యా బలగాలు గురిపెట్టడంతో ఏ క్షణంలో అణు విస్ఫోటనం సంభవిస్తుందోనని ఐరోపా దేశాలు వణికిపోతున్నాయి. తన దాడుల్లో భాగంగా ఇప్పటికే చెర్నోబిల్ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు జాఫోరిజియా అణు ప్లాంట్ పై దాడి ప్రారంభించింది. దాంతో 36 ఏళ్ల క్రితం జరిగిన చెర్నోబిల్ ప్రమాదం, అది మిగిల్చిన పెను విషాదం మళ్లీ ప్రపంచం కళ్ల ముందు మెదులుతున్నాయి.యూరప్ లోనే అతిపెద్దదైన ఈ కర్మాగారం పేలిపోతే రెండో ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకీలపై అణు బాంబు దాడి వల్ల, చెర్నోబిల్ ప్రమాదం వల్ల జరిగిన దానికంటే ఎన్నో రెట్ల నష్టం వాటిల్లుతుంది.

నాడు చిన్న తప్పు.. పెను ముప్పు

సుమారు 36 ఏళ్ల క్రితం.. 1986 ఏప్రిల్ 26వ తేదీ రాత్రి అప్పటి యుఎస్సెస్ ఆర్ లో భాగంగా.. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఉన్న చెర్నోబిల్ అణు ప్లాంటులో భద్రత వ్యవస్థలను పరీక్షిస్తున్న ఇంజనీర్లు.. ఆ సమయంలో విద్యుతు సరఫరా నిలిపివేస్తే ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయోగం చేయాలనుకున్నారు. ఆ బిజీలో అప్పటికే అక్కడ తలెత్తిన చిన్న సమస్యను గుర్తించలేకపోయారు. నాలుగో నంబర్ అణు రియాక్టరుకు కూలింగ్ వాటర్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆవిరి ఒత్తిడి పెరిగి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి రియాక్టర్ మూత ఊడిపోయి కోర్ అనే అణు ఇంధనం భారీగా లీక్ అయ్యింది. దాంతో చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగాయి. పది రోజులపాటు అవి కొనసాగాయి. ఈ ప్రమాద సమయంలో సంఘటన స్థలంలో ఇద్దరు మాత్రమే మరణించారు. 134 మంది అస్వస్థులయ్యారు. వారిలో 28 మంది ఆ తర్వాత చనిపోయారు. కానీ ఈ ప్రమాద దుష్ఫలితాలు ఇప్పటికీ ప్రభావం చూపుతూనే ఉన్నాయి.

13 దేశాల్లో లక్షలాది మంది మృతులు

అణు ప్రమాదం కారణంగా చెర్నోబిల్ ప్లాంట్ నుంచి వెలువడిన రేడియేషన్, రేడియో ధార్మికత ప్రభావం రష్యాతోపాటు 13 దేశాలపై పడింది. లక్షలాది మందిని సుదూర ప్రాంతాలకు తరలించారు. అయినా కూడా క్యాన్సర్, చర్మ, గొంతు సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో సుమారు 2 లక్షల మంది మరణించారని అంచనా. ఇప్పటికీ వేలాదిమంది అణు ధార్మికతకు గురై రకరకాల రుగ్మతలతో మంచంపైనే గడుపుతున్నారు. చెర్నోబిల్ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల పరిధిలో జంతువులు, చెట్లు, పక్షులు ఇతర జీవజాలం నిర్జీవంగా మారిపోయాయి. ఇప్పటికీ చెర్నోబిల్ ప్రాంతంలో వృక్షజాలాల్లో అణుధార్మిక ప్రభావం కనిపిస్తుండటంతో ఆ ప్రాంతం మొత్తాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 బ్లాకులు, ఆరు రియాక్టర్లతో అతిపెద్దదైన జఫోజిరియా అణు కేంద్రం రష్యా దాడిలో పేలిపోతే ఇంకెంత ఐరోపా మొత్తం నాశనం అవుతుందన్న భయాందోళనలు అలుముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి