iDreamPost

మండలిలోనూ టీడీపీ ఆశలకు గండి

మండలిలోనూ టీడీపీ ఆశలకు గండి

మండలిలో ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కొంతకాలంగా టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పడబోతోంది. త్వరలోనే ఆపార్టీ ఆశలకు గండిపడే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా అవును..అడ్డుకుని తీరుతాం అన్నట్టుగా వ్యవహరించిన విపక్ష టీడీపీ నేతలకు చెక్ పడడం ఖాయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ పార్టీకి మండలిలో 22 మంది సభ్యుల మద్ధతు ఉంది. అదే సమయంలో పాలక వైఎస్సార్సీపీ బలం క్రమంగా పెరగబోతోంది. ఇప్పటికే అధికారికంగా వైఎస్సార్సీపీకి 10 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీల మద్ధతు కూడా ఉంది. దానికి తోడుగా తాజాగా ఖాళీ అయిన నాలుగు సీట్లతో కలిపి వైఎస్సార్సీపీ బలం మరో నెల రోజుల్లోనే 14కి చేరబోతోంది.

ఇక వచ్చే మార్చి 25 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు సభ్యులు రిటైర్ అవుతుండగా, మిగిలిన 21 స్థానాలను కైవసం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఆశిస్తోంది. అదే జరిగితే మండలి నెంబర్ గేమ్ లో రాబోయే ఏడెనిమిది నెలల్లోనే టీడీపీకి చెక్ పెట్టడం ఖాయంగా చెప్పవచ్చు. వచ్చే మార్చి నాటికి రిటైర్ కాబోతున్న వారిలో టీడీపీకి చెందిన వారు 15 మంది ఉన్నారు. అందులో స్థానిక సంస్థల కోటాలో 7, గవర్నర్, ఎమ్మెల్యే కోటాలో మరో 8 మంది ఉన్నారు. ఆ జాబితాలో మళ్లీ టీడీపీ ఎన్ని గెలుచుకుంటుందన్నది సందేహమే. కనీసం బోణీ కొట్టే అవకాశం ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 మార్చి నాటికి టీడీపీ బలం 7 కు కుచించుకుపోవడం ఖాయంగా అంచనాలున్నాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీ బలం సునాయాసంగా 30 దాటబోతోంది.

దాంతో ఇప్పటికే మండలి రద్దు అంశం కేంద్రం పరిధిలో ఉన్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు మళ్లీ ఎప్పుడు జరుగుతాయోననే అంశం అంతుబట్టకుండా ఉంది. ఓవైపు కరోనా, మరోవైపు చైనాతో సరిహద్దు తగాదా కలిసి దేశంలో పరిస్థితులు రానురాను దిగజారిపోయేలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మండలి రద్దు వంటి విషయాలకు కేంద్రం ప్రాధాన్యతనిస్తుందా అనేది స్పష్టత లేదు. దాంతో పార్లమెంట్ ఎప్పుడు జరిగేనో, జరిగినా ఏపీకి సంబంధించిన మండలి బిల్లుకు మోక్షం కలిగేనో అన్నది తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే మండలి నెంబర్ గేమ్ లో ముందంజలో నిలిచే మార్గంపై వైఎస్సార్సీపీ దృష్టి పెట్టింది. దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. అదే సమయంలో టీడీపీకి చెందిన మిగిలిన ఎమ్మెల్సీలు కూడా కొందరు అధికార పార్టీ వైపు జంప్ చేసే అవకాశం ఉండడంతో మండలిలో కూడా విపక్ష బలం ఏమేరకు మిగిలేనో అన్నది కూడా ఆసక్తికరమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి