iDreamPost

వెన్నుపోటు గురించి బాబుగారే చెప్పాలి..!

వెన్నుపోటు గురించి బాబుగారే చెప్పాలి..!

నమ్మించి మోసం చేయడం, అవసరం తీరాక దూరం పెట్టడడం అనే సందర్భాల్లో వెన్నుపోటు అనే పదం వాడుకలో ఉపయోగిస్తుంటాం. రాజకీయ పరమైన అంశాల వల్ల ఈ పదానికి భారీ ప్రాచూర్యం దక్కిందని చెప్పవచ్చు. తెలుగు రాజకీయాల్లో ఈ పదానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. వెన్నుపోటు అనే పదం ప్రస్తావనకు వస్తే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మొదటి వరసలో వినిపిస్తుంది. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబేనంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఇందుకు అనేక సంఘటనలను వారు ప్రస్తావిస్తుంటారు.

సందర్భానుసారం చంద్రబాబును ఉద్దేశించి ఇతరులు వెన్నుపోటు అనే పదాన్ని ఉపయోగించడం సర్వ సాధారణం. కానీ చంద్రబాబే ఆ మాటను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి అనడమే ఆసక్తికర పరిణామం. ఈ ఘటన చంద్రబాబుకు, వెన్నుపోటు అనే పదానికి ఉన్న అనుబంధంపై మరోసారి చర్చకు దారితీసింది. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని అందరూ గుర్తు చేసుకునేలా చేసింది.

ఎన్టీఆర్‌ నుంచి మొదలు..

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ఆరంభించిన చంద్రబాబు మంత్రి కూడా అయ్యారు. టీడీపీ స్థాపించన సమయంలో ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానన్నారు. 1983లో ఓడిపోయారు. కట్‌ చేస్తే.. మామ పంచన చేశారు. పదవి వద్దు.. మీకు సహాయంగా ఉంటానన్నారు. నమ్మకంగా ఉంటూ 1995లో టీడీపీ, సీఎం కుర్చినీ ఎన్‌టీఆర్‌ నుంచి లాక్కున్నారు. ఇది తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని భావించి.. ఎన్టీఆర్‌ కుమారులు, తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులను తన వైపు తిప్పుకున్నారు. దగ్గుబాటికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఆశ చూపారు. అనుకున్నట్లే సీఎం పీఠంపై చంద్రబాబు కూర్చున్నారు. కట్‌ చేస్తే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మొండిచేయి చూపారు. మామతోపాటు తోడళ్లుడికి ఒకేసారి వెన్నుపోటు పొడిచారు. వెంకటేశ్వరరావు టీడీపీని వీడే పరిస్థితి కల్పించారు. ఆయన కాంగ్రెస్‌ పంచన చేరాల్సిన పరిస్థితి కల్పించారు.

ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి పోటీ వచ్చే వారెవరంటే హరికృష్ణ కనిపించారు. మంత్రిపదవి ఇచ్చినా అది తాత్కాలికమే కావడంతో.. బావ అసలు రూపం తెలిసి బాధపడడం హరికృష్ణ వంతైంది. సొంతంగా అన్న టీడీపీ పార్టీ పెట్టుకునే పరిస్థితి హరికృష్ణకు తలెత్తింది. అవసరం కోసం మళ్లీ హరికృష్ణను దగ్గరకు చేర్చుకున్నా.. పార్టీలో ప్రాధాన్యత కరువైంది. మహానాడు వేదికలపైనే హరికృష్ణ అసంతృప్తి వెల్లడైంది.

మలితరం పై కూడా పడగ..

తన తరంతోపాటు మలితరానికి కూడా బాబు తన వాడకం ఎలా ఉంటుందో రుచిచూపించారు. హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌దీ తన తండ్రి పరిస్థితే. 2009 ఎన్నికల్లో మామ పిలిచాడని, తాత గెటప్‌లో వచ్చి టీడీపీ విజయం కోసం రాష్ట్ర మంతా పర్యటించారు. రోడ్డు ప్రమాదానికీ గురయ్యారు. అయినా ఎన్నికల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు చంద్రబాబు. తన కుమారుడు లోకేష్‌ భవిష్యత్‌ కోసం జూనియర్‌ను పక్కనపెట్టేశారు. 2014లో పవన్‌ కల్యాణ్‌ మద్ధతు కోరారు తప్పా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వైపు చూడకపోవడానికి కారణం లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ కోసమేనన్నది జగమెరిగిన సత్యం. బాబాయ్‌ బాలయ్యకు, అబ్బాయ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు మధ్య వివాదాలు కూడా బాబుగారి చలవేనని ఆ పార్టీ అభిమానులు చెబుతుంటారు.

బంధువులే కాదు.. బయటవారు కూడా..

బంధువులే కాదు.. బయట వారు కూడా బాబు వాడకానికి బలైన వారున్నారు. 1995లో ఎన్టీఆర్‌ నుంచి పార్టీని, సీఎం పదవిని చేజిక్కించుకునే ఘటన అంతా హైదరాబాద్‌లోని వైశ్రాయ్‌ హోటల్‌లోనే జరిగింది. వైశ్రాయ్‌ హోటల్‌ యజమాని ప్రభాకర్‌ రెడ్డిది కాగా.. ఆయన భావ మరిది, టీడీపీ ఒకప్పటి నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల్‌ రెడ్డి ఈ ఘటనలో కీలక పాత్ర. బొజ్జల గోపాల్‌రెడ్డి అనారోగ్యం పాలవగా.. దాన్ని సాకుగా చూపి ఆయన్ను గత ప్రభుత్వ హాయంలో మంత్రి పదవి నుంచి తప్పించారు చంద్రబాబు. ఆయన స్థానంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి కట్టబెట్టారు. బాబు వెన్నుపోటును తలుచుకుని బాధపడడం బొజ్జల వంతు కాగా.. ఆయన తీరును ఎండగట్టడం బొజ్జల గోపాల్‌ రెడ్డి సతీమణి వంతైంది.

బ్రాండ్‌ను తొలగించుకోవాలనేనా..?

ఇలా చెప్పుకుంటూ పోతే.. చంద్రబాబు రాజకీయ జీవితంలో అనేక మంది కనిపిస్తారు. ఇలాంటి చరిత్ర పెట్టుకున్న చంద్రబాబు.. ఇతరులను ఉద్దేశించి వెన్నుపోటు వ్యాఖ్యలు చేయడం చూసేవారికి విడ్డూరంగా తోస్తోంది. బట్టకాల్సి మొహాన వేసే రాజకీయాలు చేసే చంద్రబాబు.. తనపై ఉన్న వెన్నుపోటు ముద్రను కాస్తంతైనా తగ్గించుకునే క్రమంలోనే ఇతరులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవాలి. అవున్నా.. కాదన్నా.. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరంటే చంద్రబాబేనని తెలుగు రాజకీయాలను గమనించే వారెవరైనా ఘంటాపథంగా చెబుతారు. అలాంటిది చంద్రబాబే వెన్నుపోటు గురించి మాట్లాడడం వల్ల ప్రజల నోళ్లలో మరింతగా నానడం తప్పా ప్రయోజనం ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి