iDreamPost

చంద్రబాబుకి బలంగా తగులుతున్న సోషల్ మీడియా దెబ్బ.

చంద్రబాబుకి బలంగా తగులుతున్న సోషల్ మీడియా దెబ్బ.

ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే అడవికి రాజైన నీలి నక్క అనే చిన్నప్పటి నీతి కధ ఒకటి గుర్తుకు వస్తుంది. నీలి రంగు పూసుకుని నక్క జంతువులని వంచించి అడవికి రాజై ఏలినట్టు బాబు కూడా మీడియా ముసుగు వేసుకుని ఇన్ని రోజులు అనుభవజ్ఞుడు అనే మేలి ముసుగు ధరించి తనని తాను బ్రాండ్ గా రాష్ట్రంలో ప్రమోట్ చేసుకున్నారు, కానీ ఏనుగు నక్క మీద నీళ్ళు చల్లి దాని నిజస్వరూపం మిగతా జంతువులకు చూపినట్టు సోషల్ మీడియా కూడా బాబు నిజ స్వరూపం ఎప్పటికి అప్పుడు బయట పెడుతు అయన చేస్తున్న తప్పులని ఏకి పారేస్తుంది. నక్క కదలో నీతి మాదిరిగా చంద్రబాబు అనుభవం అనే ముసుగు కూడ సోషల్ మీడియా ముందు ఎక్కువ రోజులు దాగలేక పోయింది.

నిజానికి చంద్రబాబు రామారావుని గద్దె దింపి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజుల్లో ఒక గ్లోబల్ లీడర్ గా ముద్ర వేసుకున్నారు, చంద్రబాబు పై ఈ ముద్ర పడటానికి పత్రికలు నిర్వహించిన పాత్ర చెప్పుకోదగినది, ఆనాడు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దినపత్రికలు భేషరతుగా చంద్రబాబు కొలువులో ఊడిగం చేశాయి. చంద్రబాబు పై ఒక్క నింద పడకుండా, పడిన నిందలు ప్రజలకు తెలియనియకుండా రక్షణ కవచంలా నిలిచాయి. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న పి.జనార్దన రెడ్డి ఒకానొక సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మీడియా మ్యానెజ్ మెంట్ గురించి మాట్లాడుతు “ఈ మీడియా వాళ్ళు ఉన్నది ఉన్నట్టు రాస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు రెండు రోజులు కూడా ఉండనివ్వరు. మీడియా అండతోనే చంద్రబాబు అధికారంలో ఉండటం సాద్యం అవుతుంది” అని చెప్పారు, అంటే చంద్రబాబు గారికి ఆనాటి ప్రధాన పత్రికలు ఎలా వత్తాసు పలికాయో అర్ధం చేసుకోవచ్చు.

చంద్రబాబు లో స్వతహాగా నాయక్త్వపు లక్షణాలు లేకపోయినా, ఆయన ఉపన్యాసకుడు కాకపోయినా, ప్రజలను ఆకర్షించే సమ్మోహన శక్తి లేకపోయినా, రాజకీయంగా ఒక సిద్దాంతం అంటూ పాటించకపోయినా, రెండు ఎకరాల నుండి దేశంలోనే ధనిక రాజకీయ నాయకుడు అనే బిరుదు పొందినా , సొంతమామ రామారావును గద్దె దింపి పరోక్షంగా చనిపోవడానికి కారకుడైనా , మీడియా అనే రక్షణ కవచం వలన గొప్ప నాయకుడిగా చెలామని అయ్యారు. ఈ మీడియా రక్షణ కవచం వలనే ఆయన మధ్యపాన నిషేధం ఎత్తేసినా , విద్యుత్ ఉద్యమం లో భషీర్ భాగ్ కాల్పుల ఘటన జరిగినా, అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కించినా, సబ్సిడీ బియ్యం ధరలు పెంచినా, ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం పత్రికల్లో కనిపించేవి కావు. పైగా ఎంతో కష్టపడి పత్రికలన్ని హైటెక్ సిటి పునాదిరాళ్లలోనే జనార్ధనరెడ్డి పేరుని భూస్తాపితం చేసి హైటెక్ సిటి అంటే చంద్రబాబు , చంద్రబాబు అంటే హైటెక్ సిటి అన్నoతగా ప్రచారం చేసి ఆయనకి ఒక గ్లోబల్ లీడర్ ముద్ర వేశాయి , ఆ ఫలితమే ఇప్పటికి రాష్ట్రంలో అనేక మందికి హైటెక్ సిటికి పునాదివేసిన జనార్ధన రెడ్డి గుర్తు ఉండకపోవడం.

ఇలా రెండు దశాబ్దాలు మీడియా అండతో అనుభవజ్ఞుడు , సమర్ధుడు , దార్శనికుడు అని బిరుధులు తగిలించుకున్న చంద్రబాబుకు అనుకోని శత్రువు సోషల్ మీడియా రూపంలో ఎదురైంది . స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండటం తో యువతలో శోధనా శక్తి పెరిగింది, దీంతో చంద్రబాబు ఏళ్ళు గా ప్రజలను మభ్యపెడుతు వస్తున్న అనుభవజ్ఞుడు అనే రంగు వెలిసిపోతోంది. తాను ఒక సమస్య మీద ఎన్ని రకాలుగా అవకాశవాదంతో మాటలు మార్చాడో ప్రజల ముందు నిమషాల్లో ప్రత్యక్షం అవుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా తాజాగా జరిగిన విశాఖ ప్రమాధంలో చంద్రబాబు స్పందించిన తీరు ఆయనలోని డొల్లతనాన్ని మరోసారి బయట పెట్టంది .

విశాఖ దుర్ఘటన లో చనిపోయిన వారికి దేశంలో ఎన్నడు ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కరికి ఏకంగా కోటి రూపాయలు ప్రకటిస్తే అవి ఏమి సరిపోతాయి అని మాట్లాడారు చంద్రబాబు, అయితే సోషల్ మీడియా అనేది ఒకటి డేగ కన్ను వేసి చూస్తుందని సోయలో లేకుండా చంద్రాబాబు ఇలా మాట్లాడి మరోకసారి నెటిజన్లకు దొరికిపోయారు . చంద్రబాబు ఇలా మాట్లాడారో లేదో ఇదే చంద్రబాబు గతంలో ఆయన పాలనా హయం లో జరిగిన నగరం ఘటనలో చంద్రబాబు అందించిన సాయం ఎంత అనే ప్రశ్న వేస్తూ దానికి సమాదానం గా ఆనాడు చంద్రబాబు నగరం దుర్గటనలో భాదితులకి కేవలం 25 లక్షలు మాత్రమే ఇచ్చిన సంగతి వెలుగులోకి తీసుకువచ్చి చంద్రబాబుని నిమషాల్లో నవ్వుల పాలయ్యేలా చేశారు.

అలాగే మనుషుల ప్రాణాలు అంటే ప్రభుత్వంకి లెక్కలేకుండా పోయింది అని మరో అడ్డగోలు ఆరోపణ చేశారు చంద్రబాబు, అయితే సోషల్ మీడియా ఆయన పుష్కరాల్లో చనిపోయిన 29 గురించి అనాడు ఎంత చులకనగా మాట్లాడారో బయటపెట్టారు . మీడియా ముఖంగా ఇలాంటివి జరుగుతా ఉంటాయని, కుంభమేళలో చనిపోలేదా , బస్సు ప్రమాదాలలో చనిపోవడంలేదా అని అత్యంత భాద్యతా రాహిత్యంగా మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టడంతో తెలుగుదేశానికి ఆ పార్టి సానుభూతి పరులకు చందబాబుని ఎలా డిఫెన్స్ చేయాలో అర్ధం కాక తలలు పట్టుకున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి అందరికన్నా నేనే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకునే చంద్రబాబు కరోనా సహాయం కింద రాష్ట్రానికి 10 లక్షలు మాత్రమే ఇచ్చి ఇప్పుడు జగన్ ఇచ్చే పరిహారం మీద విమర్శ చేయడం ఏంటని నేరుగా నిలదీస్తున్నారు.

ఒకప్పుడు పత్రికల అండతో తన రాజకీయ ప్రస్తానం సాగించిన చంద్రబాబుకు ఇప్పుడు సోషల్ మీడియా అనే సాధనం ప్రజల చేతిలో వజ్రాయుధం గా మారిపోయే సరికి ఏం చేయాలో తోచడంలేదు , మొన్నటిదాక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక క్యాబినేట్ సమావేశంలోనే ఆయన సోషల్ మీడియాని తట్టుకోలేక పోతున్నాం అని చెప్పారు అంటే ఆ సెగ ఆయనకి ఎంత కాక పుట్టిస్తుందో అర్ధం చేసుకోవచ్చు . అయితే కొద్ది రోజుల క్రితం కార్యకర్తలతో వీడియో కాంఫరన్స్ నిర్వహిస్తు సోషల్ మీడియాలో తమ పార్టికి తమకి మద్దతుగా పని చేయాలనుకునే వారికి మేము డబ్బులిచ్చి పెట్టుకుంటామని ప్రకటన ఒకటి చేశారు. కానీ తెలుగు తముళ్లు మాత్రం ఎంతమంది సోషల్ మీడియాలో పని చేసినా అయన రెండు కళ్ళ సిద్దాంతం , రెండు నాలుకల దోరణి విడువనంత కాలం ఏం చేసినా ప్రయోజనం ఉండదనే నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. నాడు పత్రికల అండతో నెట్టుకొచ్చినా ఇప్పుడు ఉన్న సాంకేతిక విప్లవం ముందు మీడియా పత్రికల అండ పనికిరాదని. తమ నాయకుడి ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు ఎంత చేసినా పార్టికి భవిష్యత్తు లేదని బహిరంగంగానే తెలుగు తమ్ముళ్ళు చెప్పడం విశేషం ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి