iDreamPost

మోడి తనకు ఫోన్ చేసినట్లు చెప్పటానికే మీడియా సమావేశం పెట్టాడా ?

మోడి తనకు ఫోన్ చేసినట్లు చెప్పటానికే మీడియా సమావేశం పెట్టాడా ?

చంద్రబాబునాయుడు ప్రెస్ మీట్లో చెప్పిన విషయం విన్న తర్వాత అందరికీ ఇలాగే అర్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడి తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపధ్యంలో మోడి మాట్లాడినపుడు తాను అనేక సూచనలు చేసినట్లు చెప్పారు. లాక్ డౌన్ ను సమర్ధిస్తున్నట్లు కూడా చెప్పాడు. టెస్టుల సంఖ్య పెంచాలని సలహా ఇచ్చినట్లు చెప్పుకున్నారు. తాను చేసిన సూచనలతో మోడి ఏకీభవించినట్లు కూడా చెప్పుకుని తృప్తి పడ్డాడు.

ఇంతకీ మోడి అసలు చంద్రబాబుకు ఎందుకు ఫోన్ చేసినట్లు ? ఎందుకంటే సోమవారం సాయంత్ర ప్రధానితో మాట్లాడేందుకు చంద్రబాబే ఫోన్ చేశాడు. అయితే మోడి అందుబాటులోకి రాలేదు. బహుశా ఫోన్ అందుకున్న ప్రధాని కార్యాలయం ఉన్నతాధికారులతో మోడితో తాను మాట్లాడాలని అనుకుంటున్న విషయాన్ని చెప్పుంటాడు. అదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా తర్వాతెప్పుడో మోడితో చెప్పి ఉంటారు.

ఈ ఉదయం మోడి నిజంగా ఫోన్ చేసాడో లేక పీఎంఓ నుంచి ఎవరన్నా చంద్రబాబుతో మాట్లాడారో అధికారికంగా వెల్లడి కాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2018లో ఎన్డీఏలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేసిన తర్వాత మోడి-చంద్రబాబు మాట్లాడుకున్నదే లేదు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా చంద్రబాబుతో మోడి పెద్దగా మాట్లాడింది లేదు . చంద్రబాబు ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా మోడి ఇవ్వని విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని మీద చంద్రబాబు రగిలిపోయిన సంగతి గుర్తుంది ఉంటుంది. బీజేపీతో ఎన్నికలకు పొతే లాభం లేదు అని లెక్కలు వేసుకొని ఎన్డీఏ నుండి చంద్రబాబు బయటకు వచ్చేశాడు.

ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశాడో అప్పటి నుండే మోడిపై చంద్రబాబు పెద్ద యుద్ధమే మొదలుపెట్టినట్లుగా రెచ్చిపోయాడు. సరే చివరకు ఫెయిలయ్యాడు . 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ మోడికి దగ్గరవుదామని చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసి తప్పు చేశానని బహిరంగంగా ప్రకటించి చంద్రబాబు చెంపలేసుకున్నా మోడి మనసు కరగలేదు. అలాంటిది ఎన్నో ప్రయత్నాల తర్వాత చంద్రబాబుకు మోడి ఫోన్ చేయటం(దీని మీద పీఎంఓ ప్రకటన రావాలి) గమనార్హం. బహుశా ఈ విషయాన్ని చెప్పుకునేందుకే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద చేసే ఆరోపణలు, విమర్శలన్నీ మామూలే కదా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి