iDreamPost

చంద్రబాబుకే దిక్కులేదు.. ఈయన వేలాదిమందిని ఏపికి రప్పించాడట!!!

చంద్రబాబుకే దిక్కులేదు.. ఈయన వేలాదిమందిని ఏపికి రప్పించాడట!!!

గడచిన కొద్ది రోజులుగా చంద్రబాబునాయుడు విచిత్రమైన పబ్లిసిటీ చేయించుకుంటున్నాడు. తాను ట్విట్టర్లో ప్రచారం చేసుకోవటమే కాకుండా ఎల్లోమీడియాలో కూడా చేయించుకుంటున్నాడు. అదేమిటంటే గుజరాత్, కర్నాటక, తమిళనాడులో కరోనా వైరస్ కారణంగా ఇరుక్కుపోయిన వలస కార్మికులు, జాలర్లను ఏపికి తానే తెప్పించినంతగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఒకవైపు పై రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని ఏపికి తెప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి అందరికీ తెలిసిందే.

అదే సమయంలో జగన్ను మించి తనను తాను ప్రొజెక్టు చేసుకుంటున్నాడు. అయితే చేసుకుంటున్న ప్రచారమంతా ఉత్త డొల్లే అని తేలిపోయింది. ఎలాగంటే మూడు రోజుల క్రితం విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ప్రమాదం జరిగిన విషయం వెలుగు చూసిందో వెంటనే అర్జంటుగా అక్కడికి వెళ్ళిపోవాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశాడు. విచిత్రంగా ఏపికి వెళ్ళటానికి తనకు పర్మిషన్ ఇవ్వాలంటూ నరేంద్రమోడికి లేఖ రాశాడు.

చంద్రబాబు లేఖను ప్రధానమంత్రి కార్యాలయం అసలు పట్టించుకోనేలేదంటున్నారు. అదే సమయంలో తెలంగాణా+ఏపి ప్రభుత్వాలతోనే మాట్లాడుకోమని ఉచిత సలహా ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సరే విషయం ఏదైనా చంద్రబాబును కేంద్రం పట్టించుకోలేదన్నది స్పష్టమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను స్వయంగా వైజాగ్ వెళ్ళాలంటేనే కేంద్రం పట్టించుకోలేదు. అలాంటిది గుజరాత్, తమిళనాడు, కర్నాటక నుండి వేలాదిమంది వలస కార్మికులను, జాలర్లను తానే ఏపికి తెప్పించానని చెప్పుకోవటం అబద్ధమని తేలిపోయింది.

గుజరాత్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది మాత్రం నిజం. అలాగే కేంద్ర హోంశాఖకు లేఖలు రాసిందీ నిజమే కావచ్చు. అదికూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు తెలుసుకున్న తర్వాతే లేఖలంటూ చంద్రబాబు హడావుడి చేశాడు. తాజాగా ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజీ ప్రమాదం విషయంలో కూడా ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు లేఖలంటూ నానా హడావుడి చేస్తున్నాడు. తాను రాసిన లేఖలకు ప్రధామంత్రి స్పందించి చర్యలు తీసుకున్నందుకు రాష్ట్రప్రజల తరపున నరేంద్రమోడికి చంద్రబాబు ధన్యవాదాలు చెప్పేయటం కూడా విచిత్రంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి