iDreamPost

టీడీపీపై “పైబ‌ర్” పిడుగు..!

టీడీపీపై “పైబ‌ర్” పిడుగు..!

ఈ నెల 11న స‌మావేశ‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ గ‌త తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసిందే. ఏపీ ఫైబ‌ర్ నెట్, చంద్ర‌న్న కానుక‌, చంద్ర‌న్న తోఫా, చంద్ర‌న్న క్రిస్మ‌స్ కార్య‌క్ర‌మాల‌జ‌రిగిన అవినీతిపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. ఇప్పుడు తాజాగా.. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీ ఫైబ‌ర్ నెట్ పై ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో ఆ సంస్థ‌పై కేసు న‌మోదు కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంటి ఇంటికీ ఇంట‌ర్నెట్ అంటూ తెలుగుదేశం తెరపైకి తెచ్చిన ప్రాజెక్టు ఫైబ‌ర్ నెట్. త‌క్కువ ధ‌ర‌కే ప్ర‌తి ఇంటికీ నెట్ క‌నెక్ష‌న్ క‌ల్పిస్తామంటూ అప్ప‌ట్లో బాకా ఊదింది. ప్ర‌జ‌ల‌పై బ‌ల‌వంతంగా రుద్దేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ పథకంపై ఎన్ని ఆరోపణలొచ్చినా నాటి టీడీపీ ప్ర‌భుత్వం వెనక్కు తగ్గలేదు. గతంలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరా సాఫ్ట్‌ అనే సంస్థకు ఫైబర్‌ కేబుల్‌ వేసే కాంట్రాక్టును అప్పగించింది. చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి ఫైబర్‌నెట్‌ సంస్థలోనూ డైరెక్టర్‌గా ఉండ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ ప‌థ‌కం ప‌ర్య‌వేక్ష‌ణ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఓ సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఏపీ ఫైబ‌ర్ నెట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు అయిన ఈ సంస్థ‌పై ఇప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఆది నుంచీ ఆరోప‌ణ‌లే…

2017లో ఏపీ ఫైబ‌ర్ నెట్ అధికారులు.. ఇంటి ఇంటికీ ఇంట‌ర్నెట్ ప‌థ‌కానికి సంబంధించిన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ఏర్పాట్ల కు టెండ‌ర్ల‌ను ఆహ్వానించారు. ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల రావుకు చెందిన పేస్ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా బిడ్డింగ్ లో పాల్గొంది. త‌క్కువ కే కోట్ చేసినా ఆ కాంట్రాక్ట్ పేస్ కంపెనీకి ద‌క్క‌లేదు. టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ సంస్థ‌కు కాంట్రాక్ట్ అప్ప‌గించారు. ఆ కంపెనీ కంటే త‌మ కంపెనీ అన్ని ర‌కాలుగానూ అత్య‌ధిక అర్హ‌త‌లు ఉన్నాయ‌ని, అయిన‌ప్ప‌టికీ టెరాకు ఎలా కేటాయించారో అర్థం కాలేద‌ని అప్ప‌ట్లోనే దీనిపై పేస్ అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఇప్పుడు తాజాగా.. ఆ కంపెనీపై ఫిర్యాదు చేశారు. ద‌క్షిణ కొరియా సంస్థ‌కు చెందిన డెసాన్ నెట్ వ‌ర్క్ సొల్యూష‌న్ సంస్థ కూడా ఏపీ ఫైబ‌ర్ నెట్‌పై ఫిర్యాదు చేసింది. ఆప్టికల్ లైన్ టెర్మినల్ (OLT)టెండర్‌లో తాము L1 (అత్యల్పం) గా నిలిచి.. 200 తక్కువ ధరకే ఓఎల్‌టీల‌కు కొనుగోలు ఆర్డర్ ఇచ్చినా.. అధిక ధ‌ర‌కు కోట్ చేసిన టెరా సాఫ్ట్‌వేర్‌కు క‌ట్ట‌బెట్టి న‌ట్లు డెసాన్ కూడా ఆరోపిస్తోంది.

సీబీఐ ద‌ర్యాప్తు ప్రారంభ‌మైతే…

ఏపీ ఫైబ‌ర్ నెట్ పై ఆయా సంస్థ‌ల ఫిర్యాదుతో ఇప్ప‌టికే కేసు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా కొద్ది రోజుల ముందు ప్ర‌భుత్వం కూడా ఏపీ ఫైబ‌ర్ నెట్ అక్ర‌మాల‌పై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు తెలిసిందే. విచార‌ణ ఇంకా ప్రారంభం కాన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక‌వేళ సీబీఐ విచార‌ణ ప్రారంభ‌మైతే టీడీపీ నాయ‌కుల గుండెల్లో మ‌ళ్లీ రైళ్లు ప‌రుగెట్ట‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, వాహ‌నాల కొనుగోల్ మాల్‌లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అరెస్ట్ అయ్యారు. ఈఎస్ఐ స్కాం భ‌యం టీడీపీ నేత‌ల‌ను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఏపీ ఫైబ‌ర్ నెట్ కు చెందిన అవినీతి డొంక క‌దులుతుండ‌డం వారిని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. ఈ స్కాంలో 850 కోట్ల రూపాయ‌ల మేర అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి