iDreamPost

మంత్రివర్గంలో వారికి చోటు దక్కుతుందా, వైఎస్సార్సీపీ ఫస్ట్ బ్యాచ్ నేతల చుట్టూ చర్చ

మంత్రివర్గంలో వారికి చోటు దక్కుతుందా, వైఎస్సార్సీపీ ఫస్ట్ బ్యాచ్ నేతల చుట్టూ చర్చ

వైఎస్ జగన్ కి ఓ గుర్తింపు ఉంది. బహుశా రాజశేఖర్ రెడ్డి నుంచి అది కొనసాగుతుందనే అభిప్రాయం కూడా ఉంది. తనను నమ్మినవాళ్లకు ఆయన న్యాయం చేస్తారనే అభిప్రాయం బలంగా పార్టీ శ్రేణుల్లో ఉంటుంది ఆలస్యమయినా అందరికీ అవకాశాలిస్తారనే వాదన కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదురించి అడుగులేసిన తనకు అండగా నిలిచిన వారికి అందలం అప్పగించడంలో ఆయన ఎక్కడా వెనుకాడలేదు. అనేక మంది నాయకుల్ని అవసరమయిన అన్ని సందర్భాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రోత్సహించడం జగన్ తీరుకి దర్పణం పడుతుంది.

ఉదాహరణకు పిల్లి సుభాష్‌ చంద్రబోస్. తనకు అధిష్టానం వైఎస్ మాత్రమేనంటూ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. కానీ 2012 ఉప ఎన్నికలే కాకుండా, 14, 19 ఎన్నికల్లో సైతం ఆయన గట్టెక్కలేకపోయారు. అయినప్పటికీ జగన్ ఆయనకు తగిన ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ హోదా ఇచ్చి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఏకంగా రాజ్యసభకు పంపించి కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఇలా జగన్ తన తండ్రి బాటలో సాగుతున్నారనడానికి ఇదో ఉదాహరణగా చెబుతుంటారు.

ఇక 2012 ఉప ఎన్నికల నాటికి జగన్ కోసం తమ పదవులు వదులుకుని వచ్చిన నేతలలో అనేకమందికి నేటికీ ప్రాధాన్యత ఉంటుంది. అప్పట్లో 18 సీట్లకు ఎన్నికలు జరిగితే తెలంగాణాలో పరకాల, ఏపీలో రామచంద్రాపురం, నరసాపురం సీట్లు మాత్రమే కోల్పోయింది. మిగిలిన అన్ని స్థానాలను వైసీపీ గెలుచుకోవడం అప్పట్లో ఓ చరిత్ర. ఏపీ రాజకీయాల్లో ఓ మలుపు. దానికి తగ్గట్టుగా తన వెంట నడిచిన ఎమ్మెల్యేల్లో మేకతోటి సుచరితను ఏకంగా హోం మంత్రి చేశారు. ధర్మాన కృష్ణదాస్ కి ఉపముఖ్యమంత్రి స్థానం అప్పగించారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా బెర్తు దక్కింది. మిగిలిన వారిలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆనాడు జగన్ కోసం త్యాగాలు చేసిన నేతల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. వారిలో కొందరికి ఖచ్చితంగా బెర్త్ ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది.

వారిలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒకరు. టీడీపీ అధిష్టానాన్ని ధిక్కరించి ఆయన జగన్ ని అనుసరించారు. కోవూరు స్థానాన్ని 2019లో కైవసం చేసుకున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లపల్లి బాబురావు ఆ లిస్టులో ఒకరు. జెడ్పీ అధికారిగా ఉంటూ వైఎస్ ఆశీస్సులతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. జగన్ కోసం రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లో ఆయన్ని అమలాపురం పంపించడంతో ఓటమిపాలయ్యి. 2019లో మళ్లీ పాయకరావుపేటలో గెలిచారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన కూడా 2012 ఉప ఎన్నికల్లో పదవికి రాజీనామా చేసిన తర్వాత పరాజయం పాలయ్యారు. 2014లో ఆచంట పంపించగా అపజయం చవిచూశారు.. 2019లో మళ్లీ నరసాపురం నిలబెట్టుకున్నారు.

ఈ లిస్టులో మాచర్ల నుంచి వరుస విజయాలు సాధిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి , ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుతం చీఫ్ విప్ గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి , తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రైల్వేకోడూరులో గెలుస్తూ వస్తున్న శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వంటి వారున్నారు. వీరందరూ వైఎస్సార్సీపీ ఫస్ట్ బ్యాచ్ ఎమ్మెల్యేలుగా భావించాలి. కానీ వారిలో చెన్నకేశవరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు సామాజిక సమీకరణ వలన ప్రతిపాదనలోకి వచ్చే అవకాశాలు లేవు. కానీ మిగిలిన నేతలు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. భూమన, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు కొంత సంతృప్తిపడినప్పటికీ మిగిలిన నేతలంతా వివిధ కుల సమీకరణాలు కూడా అనువుగా ఉండడంతో గట్టిగా నమ్మకంతో కనిపిస్తున్నారు. దాంతో జగన్ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీరి పేర్లు ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉందని చెప్పవచ్చు. వారిలో మెజార్టీ నాయకులకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి