iDreamPost

ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ, ఏం చర్చించారు ..?

ఉండవల్లితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ, ఏం చర్చించారు ..?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల పలు రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పలు అంశాల్లో జగన్ ప్రభుత్వం తీరుమీద కూడా విమర్శలకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్ రాజమహేంద్రవరం వెళ్లి ఆయనతో భేటీకావడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే షర్మిల పార్టీకి ఎన్నికలసంఘం నుంచి గుర్తింపు వచ్చింది. తెలంగాణాలో విస్తరించాలని ఆపార్టీ యత్నిస్తోంది. వైఎస్సార్టీపీ ద్వారా బలోపేతం కావాలని చూస్తున్నా పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడంలేదు. ఈ తరుణంలో రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహరచనకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.

అదే సమయంలో వివిధ సమావేశాల కోసం రాజమహేంద్రవం వెళ్లిన బ్రదర్ అనిల్ ప్రత్యేకంగా ఉండవల్లిని కలిశారు. ఆయన ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. అనిల్ వచ్చి కలవడంలో ఎటువంటి రాజకీయప్రాధాన్యత లేదని ఉండవల్లి చెబుతున్నారు. చాలాకాలంగా ఉన్న పరిచయం రీత్యా తమ నగరానికి వచ్చిన సమయంలో ఇంటికివచ్చి కలిసి వెళ్లడంలో ప్రత్యేకత లేదని ఆయన తెలిపారు. కానీ వాస్తవానికి అందుకు భిన్నంగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చి ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఉండవల్లి అరుణ్ కుమార్ మొదటి నుంచి కేవీపీ రామచంద్రరావు అడుగుజాడల్లో నడిచారు. వైఎస్సార్ మరణం తర్వాత వారిద్దరు మరింత సన్నిహితులయ్యారు. ఇటీవల కేవీపీ వియ్యంకుడు, నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ నేతలతో కలిసి జగన్ ని బద్నాం చేసేందుకు యత్నించిన రఘురామరాజు ప్రయత్నాలు ఫలించడంలేదు. అదే సమయంలో ఉండవల్లి సైతం జగన్ మీద కొంత ఘాటుగానే స్పందించే ప్రయత్నంచేయడం వెనుక కారణాలపై కొంత చర్చ జరిగింది. ఇదంతా ఓవైపు సాగుతుండగానే బ్రదర్ అనిల్ తో ఉండవల్లి భేటీ కొంత ఆసక్తి రేపుతోంది. వారిద్దరూ ఏం చర్చించారనే దానిపై పొలిటికల్ వర్గాల్లో వివిధ రకాలుగా చర్చ సాగుతుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి