iDreamPost

బ్రిటన్‌ రాణి ఎలిజిబిత్‌ 2కు పతీవియోగం

బ్రిటన్‌ రాణి ఎలిజిబిత్‌ 2కు పతీవియోగం

బ్రిటన్‌ రాణి ఎలిజిబిత్‌ 2కు పతీవియోగం కలిగింది. ఆమె భర్త డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో ప్రిన్స్‌ ఫిలిప్‌ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 99 సంవత్సరాలు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆనారోగ్యానికి గురైన ఫిలిప్‌ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. గుండె సంబంధిత శస్త్ర చికిత్స తర్వాత ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఇంతలోనే మళ్లీ ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ రోజు ప్యాలెస్‌లో తుది శ్వాస విడిచారు. ప్రిన్స్‌ మరణించిన విషయాన్ని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వర్గాలు ప్రకటించాయి.

గ్రీకు రాజకుమారుడైన ఫిలిప్‌ను 1947 నవంబర్‌ 20వ తేదీన బ్రిటన్‌ రాణి ఎలిజిబిత్‌ రెండో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఫిలిప్‌ బ్రిటన్‌కు వచ్చారు. ఎలిజిబిత్‌ వెన్నంటే ఉన్నారు. పాలనాపరంగా రాణికి సహాయసహకారాలు అందించారు. అనారోగ్య కారణాలతో 2017లో రాచరికపు విధుల నుంచి తప్పుకున్నారు. వివాహానికి ముందు ఆయన సైన్యంలో పని చేశారు.

ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణించిన విషయాన్ని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వర్గాలు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాయి. ప్రిన్స్‌ మృతి పట్ల వివిధ దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంతాపాన్ని తెలిపారు. ఫిలిప్‌ సైన్యంలో విశేష సేవలందించారని, సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని మోదీ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి