iDreamPost

భయపెడుతున్న బాలీవుడ్ విలన్లు

భయపెడుతున్న బాలీవుడ్ విలన్లు

ఒకప్పుడు 90వ దశకంలో విలన్ అంటే మనకు రావుగోపాల్ రావు, నూతన్ ప్రసాద్, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు అంటూ అచ్చ తెలుగువాళ్లే ఉండేవాళ్ళు. ఒకరకంగా చెప్పాలంటే ఏ సినిమా చూసినా హీరో ఎవరైనా విలన్లుగా వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండేవారు కాదు. ఆఖరి పోరాటం కోసం రాఘవేంద్ర రావు గారు హిందీ నుంచి అమ్రిష్ పూరిని తీసుకొచ్చినప్పుడు అందరూ కొత్తగా థ్రిల్ గా ఫీలయ్యారు. స్వంత డబ్బింగ్ తో ఆయన చేసిన విలనీకి మంచి హిట్లు పడ్డాయి.

జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ లాంటి బ్లాక్ బస్టర్లు పడేసరికి డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత అశ్వమేథం రూపంలో బ్రేక్ పడింది. ఈయన కన్నా ముందు సురేష్ ఒబెరాయ్ ని మరణ మృదంగంతో పరిచయం చేశారు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. కొంత కాలం తర్వాత ముఖేష్ ఋషి, షియాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, అశుతోష్ రానాల శకం నడిచింది. వీళ్లకు భారీ హిట్లు కూడా పడ్డాయి. ఒకదశలో బాషరాని ఇలాంటి వాళ్ళను నెత్తినబెట్టుకోవడం ఏమిటని కోట గారు ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్

ఇప్పుడు వర్తమానానికి వద్దాం. తెలుగు తమిళ భాషల్లో విలన్లు చేస్తున్న బాలీవుడ్ మాజీ హీరోలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఏ సినిమా డిజాస్టర్ కు తక్కువ రిజల్ట్ ఇవ్వడం లేదు. ముందుగా జాకీ ష్రాఫ్ గురించి చెప్పుకోవాలి. శక్తి నుంచి సాహో దాకా భారీ ప్రాజెక్ట్స్ లో నటించిన జాకీని టాలీవుడ్ లో విజయం వరించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ మహేష్ మంజ్రేకర్ కు దక్కిన సక్సెస్ లు అంతంత మాత్రమే. ఏరికోరి నీల్ నితీష్ ని తీసుకొస్తే అతగాడి పరిస్థితి ఏమి భిన్నంగా లేదు.

దర్బార్ కోసం ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి సునీల్ శెట్టిని పట్టుకొస్తే అతనే మెయిన్ మైనస్ అయ్యాడు. సుదీప్ పహిల్వాన్ లో కూడా మెప్పించలేదు ఇతను. చుంకీ పాండేది ఇదే దారి. ఇలా అవకాశాలు, రెమ్యునరేషన్ల కోసం టాలీవుడ్ కు వస్తున్న హిందీ బ్యాచ్ వల్ల మనకు ఒరుగుతోంది ఏమి లేదు. పోనీ తెలుగువాళ్ళనే తీసుకుందామన్నా ఇక్కడ క్యాలిబర్ ఉన్న సపోర్టింగ్ యాక్టర్స్ తక్కువగా ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఎప్పుడో బోర్ కొట్టేశాడు. ఆదిత్య మీనన్ ది రెండునాళ్ళ ముచ్చట అయ్యింది. సంపత్ రాజ్ అడపాదడపా నెట్టుకొస్తున్నారు. ఈ లెక్కన రిజల్ట్స్ తో భయపెడుతున్న బాలీవుడ్ విలన్ల కన్నా కొత్త ఒప్షన్స్ వెతుక్కోవడం బెటర్ ఏమో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి