iDreamPost

కోన‌సీమ‌లో క‌ల‌క‌లం, ఓఎన్జీసీ సైట్ లో బ్లో అవుట్

కోన‌సీమ‌లో క‌ల‌క‌లం, ఓఎన్జీసీ సైట్ లో బ్లో అవుట్

కోన‌సీమ ప్రాంతంలో మ‌రోసారి క‌ల‌క‌లం రేగింది. ఓన్జీసీ బావిలో గ్యాస్ లీక్ అవుతోంది. ఎగిసిప‌డుతున్న గ్యాస్ ని అదుపు చేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇంకా కొలిక్కి రాక‌పోవ‌డంతో ఆందోళ‌న పెరుగుతోంది. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ఓన్జీసీ అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీ కూడా సంద‌ర్శించారు. స్థానికుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. గ‌తంలో న‌గ‌రం గ్రామంలో గెయిల్ పైప్ లైన్ లీక్ కావ‌డంతో అపార న‌ష్టం సంభవించిన నేప‌థ్యంలో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఆరేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో మూడు ప‌దుల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టికీ ఆ న‌ష్టం నుంచి స్థానికులు కోలుకోలేదు.

అంత‌కుముందు గ‌డిచిన మూడు ద‌శాబ్దాల్లో ప‌లుమార్లు బ్లో అవుట్ ఘ‌ట‌న‌లు సంభ‌వించాయి. పాశ‌ర్ల‌పూడి బ్లో అవుట్ సుదీర్ఘ‌కాలం పాటు సాగింది. ప్ర‌స్తుతం ఘ‌ట‌న సాయంత్రం స‌మ‌యంలో జ‌ర‌గ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు, అధికారులు వెంట‌నే అలెర్ట్ కావ‌డానికి దోహ‌ద‌ప‌డింది. తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ఉప్పుడి గ్రామం వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాట్రేని కోన మండలంలోని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు క‌ల‌త చెందుతున్నారు. ప్ర‌మాద ప్రాంతం నుంచి భారీ శ‌బ్దాలు వెలువ‌డ్డాయి.

10 సంవ‌త్స‌రాల క్రితం ఉప్పుడి వ‌ద్ద ఓఎన్జీసీ ఇక్క‌డ గ్యాస్ త‌వ్వ‌కాలు జ‌రిపింది. ఆ త‌ర్వాత కొద్ది కాలానికే గ్యాస్ లోఫ్రెజ‌ర్ కి చేర‌డంతో డ్రిల్లింగ్ పూర్తిచేసి సీలు వేశారు. 10ఏళ్ల క్రితం త‌వ్వ‌కాలు జ‌రిపిన బావిలో ఆదివారం సిబ్బంది త‌నిఖీలు నిర్వ‌హించారు. అయితే రిగ్ మరమత్తులు నిర్వహించే సమయంలో వాల్ వదిలివేయడంతో గ్యాస్ ఉవ్వెత్తున ఎగిసిప‌డింది. ప్ర‌మాదవ‌శాత్తూ ఎగిసిప‌డిన గ్యాస్ తో పాటు భారీ శ‌బ్ధాలు రావ‌డంతో అల‌జ‌డి రేగింది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.ప‌లు గ్రామాల‌ను పోలీసులు ఖాళీ చేయించారు. పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. సాయంత్రం పూట స‌మీప గ్రామాల్లో వంట వండేందుకు స్ట‌వ్ లు స‌హా ఇత‌ర అగ్ని కి సంబంధించిన వాటిని వెలిగించ‌కుండా నియంత్రించారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో ఉన్న అధికారులు మాత్రం రేప‌టి లోగా నియంత్రిస్తామ‌ని చెబుతున్నారు. దానికి సంబంధించిన నిపుణుల‌ను ప్ర‌మాద స్థ‌లానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి