iDreamPost

Commonwealth Games 2022 ప్రత్యర్థి ఆటగాడికి షూ ఇచ్చి ఆదుకున్న మలేషియా బ్యాడ్మింటన్ కోచ్… క్రీడా స్ఫూర్తికి కదిలిపోయిన ఇంటర్నెట్

Commonwealth Games 2022 ప్రత్యర్థి ఆటగాడికి షూ ఇచ్చి ఆదుకున్న మలేషియా బ్యాడ్మింటన్ కోచ్… క్రీడా స్ఫూర్తికి కదిలిపోయిన ఇంటర్నెట్

బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో మలేషియా బ్యాడ్మింటన్ కోచ్ చేసిన ఓ పని ఇంటర్నెట్ మనసు దోచుకుంది. ఇది కదా స్పోర్టింగ్ స్పిరిట్ అంటూ నెటిజెన్లు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ విషయమేమంటే.. కామన్వెల్త్ గేమ్స్ లో మలేషియా, జమైకా మధ్య జరుగుతున్న బ్యాడ్మింటన్ గ్రూప్ మ్యాచ్ లో భాగంగా సింగిల్స్ పోరు హోరీహోరీగా సాగుతోంది. ఇంతలో జమైకా ఆటగాడు శామ్యూల్ రికెట్స్ షూ పాడైపోయింది. వెంటనే మలేషియా బ్యాడ్మింటన్ కోచ్ హేండ్రావాన్ తన షూ తీసిచ్చి అతణ్ణి ఆదుకున్నాడు. శామ్యూల్ కూడా చాలా హుందాగా స్పందించాడు. ప్రత్యర్థి కోచ్ ఇచ్చిన షూ వేసుకుని మ్యాచ్ కంటిన్యూ చేశాడు. కానీ కాసేపటికే మలేషియా ఆటగాడు నింగ్ జే యోంగ్ చేతిలో అతను ఓడిపోయాడు. విశేషమేమంటే తర్వాత జరిగిన డబుల్స్ మ్యాచ్ కూడా శామ్యూల్ మలేషియా కోచ్ ఇచ్చిన షూ వేసుకునే ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో కూడా ఓడిపోయాడు.

మలేషియా కోచ్ హేండ్రావాన్, జమైకా ప్లేయర్ శామ్యూల్ రికెట్స్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి ఇంటర్నెట్ ని కదిలించింది. చాలా మంది యూజర్లు వీళ్ళిద్దరినీ “హీరోస్” అని కొనియాడారు. ఆటలు నేర్పేది ఇదే కదా అని మరికొందరు కామెంట్ చేశారు. వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి కూడా దీనిపై స్పందించారు. కోచ్ మిగతా ఆటగాళ్ళకి ఆదర్శంగా నిలిచారని ఆమె మెచ్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి