iDreamPost

Srikanth Bolla : బాలీవుడ్ లో తెలుగు పారిశ్రామికవేత్త బయోపిక్.. చాలా స్పెషల్.. ఎందుకంటే?

Srikanth Bolla : బాలీవుడ్ లో తెలుగు పారిశ్రామికవేత్త బయోపిక్.. చాలా స్పెషల్.. ఎందుకంటే?

ఈ మధ్య కాలంలో బయోపిక్స్ మీద సినీ మేకర్స్ దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవిత చరిత్రలను తెరకెక్కించడం చాలా సాధారణం అయిపొయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అంధ పారిశ్రామికవేత్త జీవిత చరిత్రను తెరకెక్కించనున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ సహా నిధి పర్మార్ హీరానందని కలిసి శ్రీకాంత్ బొల్లా జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తుషార్ హీరానందాని దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ శ్రీకాంత్ బొల్లా పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో ఒక తెలుగు వ్యక్తి బయోపిక్ తెరకెక్కనుండడంతో అసలు ఈ శ్రీకాంత్ బొల్లా ఎవరు? ఎవరి బయోపిక్ రాజ్ కుమార్ చేయబోతున్నారు అని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీకాంత్ బొల్లా.. పుట్టుకతోనే అంధుడు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర్లోని సీతారాంపురం పల్లెలో ఒక రైతు కుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన శ్రీకాంత్ బొల్లా జన్మించాడు. మాములుగా కొడుకు పుడితే తల్లితండ్రులు పొంగిపోతారు కానీ శ్రీకాంత్ పుట్టుక మాత్రం అతని తల్లిదండ్రులను నిరాశ కలిగించింది. కళ్ళు లేకుండా పుట్టిన శ్రీకాంత్ ను వదిలించుకోమని కూడా సలహా ఇచ్చారు కొందరు. కానీ తమ బిడ్డ ఎలా ఉన్నా మేము జీవించి ఉన్నంత వరకు బాగా చూసుకుంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు. అయితే శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి చదువులో అందరికంటే చురుగ్గా ఉండేవాడు. పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాక ఇంటర్ ఎంపీసీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆర్ట్స్ గ్రూప్ కే అవకాశం సైన్స్ చదవడానికి అంధులకు అర్హత లేదన్నారు. అయినా శ్రీకాంత్ కోర్టుకెళ్లి గెలిచి మరీ కాలేజీలో సీటు సంపాదించాడు.

అక్కడ తోటి స్టూడెంట్స్ చేసే ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లో ఉండిపోయాడు. ఇక తన లక్ష్యం కోసం హైదరాబాద్ లో దివ్యంగుల కోసం ఉన్న ఓ స్కూల్ లో చేరాడు.. అక్కడకూడా పిల్లలు అవమానించడంతో చదువు మానేసి ఇంటి దారి పట్టబోతూ ఉండగా ఒక టీచర్ శ్రీకాంత్ ను పట్టుకుని చెంప చెల్లుమనిపించడంతో శ్రీకాంత్ జీవితం మలుపు తిరిగింది. ఆ టీచర్ సాయంతో శ్రీకాంత్ ఆడియో టేపుల్లో పాఠాలు విని ఇంటర్ ఎంపీసీలో 98% మార్కులతో పాస్ అయ్యాడు. దీంతో శ్రీకాంత్ ని ఎగతాళి చేసేవారు అవాక్కయ్యారు. అయితే ఐఐటీ వారు సీటు ఇవ్వమనడంతో శ్రీకాంత్ నిరాశ చెందకుండా అమెరికాలో చదవడానికి అక్కడి యూనివర్సిటీలలో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ పరీక్షలు రాయడంతో అక్కడి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ సహా మరో రెండు ప్రముఖ యూనివర్సిటీలు కూడా శ్రీకాంత్ కు సీటు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.

శ్రీకాంత్ హార్వర్డ్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ చేరిన తొలి అంధుడిగా చరిత్రకెక్కిన శ్రీకాంత్ ప్రతిభ చూసి చదువైన వెంటనే పలు అమెరికా కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగాయి. ఆ ఆఫర్ ను తిరస్కరించిన శ్రీకాంత్ తిరిగి భారతదేశానికి వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని ప్రపోజల్ పెట్టగా స్వయంగా రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అలా మొదలైన ఈ కంపెనీ ఈరోజు 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీకి సాక్షాత్తు అబ్దుల్ కలాం వచ్చి శ్రీకాంత్ ను భుజం తట్టారు. తన లాంటి వారికీ ఏదైనా చేయాలని భావించిన శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే మరో 3000 మంది విద్యార్థులను శ్రీకాంత్ చదివిస్తున్నారు.

Also Read : Acharya & RRR : కాంట్రావర్సీ చుట్టుముట్టిన క్రేజీ చిత్రాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి