iDreamPost

వివాదాస్పద గాయకుడి జీవిత కథ సినిమాగా

వివాదాస్పద గాయకుడి జీవిత కథ సినిమాగా

ఇటీవలి కాలంలో బయోపిక్కులు ఒక ఫార్ములాగా మారిపోయాయి. ఎంత సేపూ ఒకే తరహా డ్రామాను నమ్ముకుని క్రమంగా ప్రేక్షకులను మెప్పించడం తగ్గించాయి. మహానటిని చూసి అచ్చం అదే స్టైల్ లో తీయాలని ట్రై చేసిన ఎన్టీఆర్, తలైవి సినిమాలు ఎంత దారుణంగా తిరస్కరించబడ్డాయో వాటికి వచ్చిన వసూళ్లే చెబుతాయి. స్పోర్ట్స్ స్టార్స్ ని తీసుకుని చేస్తున్న కథలు కూడా ఇంచుమించు ఇదే తరహాలో సాగుతూ ఎగ్జైటింగ్ అనిపించే సబ్జెక్టులే లేవా అనిపించేలా సాగుతున్నాయి. దానికి కాస్త బ్రేక్ ఇచ్చి కొత్త పోకడను పరిచయం చేసేందుకు నడుం బిగిస్తున్నాడు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ఎవరూ ఊహించని సెలబ్రిటీని దాని కోసం ఎంచుకున్నాడు

80 దశకంలో అమర్ సింగ్ చమ్కీల అనే గాయకుడు ఉండేవాడు. ఎంత పాపులర్ అంటే ఈయన షో కావాలంటే కనీసం నెల రోజుల ముందే బుక్ చేసుకోవాలి. ఎక్కడైనా లైవ్ కాన్సర్ట్ పెట్టడం ఆలస్యంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. యువత వెర్రెక్కిపోయి చూసేవారు. ఆడియో అమ్మకాల గురించి చెప్పేదేముంది. లాభాలు లక్షలు కోట్లలోనే. ఇంత స్టార్ డం అనుభవించిన అమర్ సింగ్ ది ప్రేమ వివాహం. ఓ షో కోసం వెళ్ళినప్పుడు 1988 మార్చిలో గుర్తు తెలియని ఆగంతుకులు ఇతన్ని భార్యని మరో ఇద్దరు బ్యాండ్ సభ్యులను కాల్చి చంపేశారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా దోషులను పట్టుకోలేకపోవడం అప్పట్లో ఓ సంచలనం

పంజాబీ సింగర్ అయిన అమర్ సింగ్ చాలా వివాదాల్లో ఉండేవాడు. వ్యసనాలు, అక్రమ సంబంధాలు, మాదక ద్రవ్యాలు, వాళ్ళ రాష్ట్రంలో ఉండే మగాళ్ల కామవాంఛల గురించి ఎక్కువగా పాటలు రాసి పాడేవాడు. ఇది నచ్చకే సాంప్రదాయ వాదులు హత్య చేశారని కొందరు, లేదు ఒక మాఫియా డాన్ ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరించినందుకు ప్రాణాలు కోల్పోయాడని మరికొందరు అంటుంటారు. ఇలా ఇతని జీవితంలో చాలా విశేషాలు ఉన్నాయి. అందుకే ఇంతియాజ్ అలీ ఇతని కథను ఎంచుకున్నాడు. కార్తీక్ ఆర్యన్-సారా అలీ ఖాన్ జంటగా భారీ బడ్జెట్ తో ఇది రూపొందబోతోందని టాక్. ఇందులో ఏమైనా షాకింగ్ వాస్తవాలు ఉంటాయేమో చూడాలి

Also Read : అనుభవాన్ని రంగరిస్తున్న దిల్ రాజు.. కానీ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి