iDreamPost

కోవాగ్జిన్‌ ధర కూడా తగ్గింది.. ఎంతో తెలుసా..?

కోవాగ్జిన్‌ ధర కూడా తగ్గింది.. ఎంతో తెలుసా..?

కరోనా వైరస్‌ కారణంగా మానవ ఉనికే ప్రమాదంలో పడింది. ఈ మహమ్మారిని ఎలా నియంత్రించేందకు ప్రభుత్వాలు తలలుపట్టుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ వస్తేనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టు పడుతుందని భావించారు. ఎట్టకేలకు పలు సంస్థలు వ్యాక్సిన్‌ను కనుగొన్నాయి. అయితే విపత్కర కాలంలో మానవాళిని ముప్పు నుంచి కాపాడాల్సిన బాధ్యతను తీసుకోవాల్సిన పరిశోధనా సంస్థలు తమ వ్యాపార పంథాను మాత్రం విడువడం లేదు.

దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట వ్యాక్సిన్ల సరఫరా అంతా కేంద్ర ప్రభుత్వం చేయగా.. తర్వాత తయారీ సంస్థలకు స్వేచ్ఛను ఇచ్చింది. తమకు 50 శాతం మిగతా 50 శాతం వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్లలోనూ విక్రయించుకోవచ్చునే వెలుసుబాటును ఇచ్చింది. దేశ ప్రజలకు వ్యాక్సిన్లు అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేసుకోండంటూ అవకాశం ఇవ్వడంతో.. వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు తమ వ్యాపార పంథాను తెరపైకి తెచ్చారు.

కోవిషీల్ట్‌ వ్యాక్సిన్‌ను కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, బహిరంగ మార్కెట్లలో 600 రూపాయల చొప్పన విక్రయిస్తామని ఉత్పత్తి సంస్థ సీరం ఇన్ట్సిట్యూట్‌ ప్రకటించింది. ఆ తర్వాత కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తమ ధరను ప్రకటించింది. దాని ధరను చూసిన వారు నోరెళ్లబెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి 150 రూపాయలు, రాష్ట్రాలకు 600 రూపాయలు, మార్కెట్‌లో 1200 రూపాయల చొప్పన ధరలను ప్రకటించింది.

ఒకే వ్యాక్సిన్‌ ధరలు వేర్వేరుగా ఉండడంతో అటు ఉత్పత్తి సంస్థలపైనా, ఇటు కేంద్ర ప్రభుత్వంపైనా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్ర, ఉత్పత్తి సంస్థల తీరును తప్పుబట్టింది. ఏ ప్రాతిపదికన ధరలను నిర్ణయించారో చెప్పాలంటూ ఆదేశించింది.

నలువైపులా విమర్శలు రావడంతో.. దిద్దుబాటు చర్యలను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. ధరలను తగ్గించాలని ఉత్పత్తి సంస్థలకు విన్నవించింది. దీంతో స్పందించిన ఉత్పత్తి సంస్థలు కంటితుడుపు చర్యలు చేపట్టాయి. సీరం తమ వ్యాక్సిన్‌ ధరను రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు బదులుగా 300 రూపాయలకే విక్రయిస్తామని నిన్న బుధవారం ప్రకటించింది. ఈ రోజు కోవాగ్జిన్‌ కూడా ముందుకు వచ్చింది. రాష్ట్రాలకు నిర్ణయించిన ధర 600 రూపాయలను 400లకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక మార్కెట్‌లో విక్రయించే ధరను మాత్రం రెండు సంస్థలు యథావిధిగానే ఉంచాయి.

Also Read : విపత్తు వేళ బేరాలు ఏలా..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి