iDreamPost

FRO శ్రీనివాసరావు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు!

FRO శ్రీనివాసరావు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు!

2022 నవంబరులో పోడు భూముల విషయంలో గుత్తి కోయలు, అటవీశాఖ అధికారులకు జరిగిన ఘర్షణలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యకు గురైన విషయం తెలిసిందే. గుత్తి కోయలు అతి కిరాతకంగా కత్తులు, గొడ్డళ్లతో అటవీ అధికారులపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ కేసులో తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితులుగా ఉన్న ఇద్దరు గుత్తికోయ తెగ వారిని న్యాయస్థానం దోషులుగా తేలుస్తూ తీర్పును వెలువరించింది.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జడ్జి వసంత్ పాటిల్ తీర్పును వెలువరించారు. ఇద్దరు దోషులైన మడకం తుల, మిడియం నంగాలకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. అసలు అప్పుడు ఏం జరిగిందంటే.. 2022 నవంబర్ లో చంద్రుగొండ మండలం బెండలపాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. వాటిని గుత్తి కోయలు పీకేసేందుకు గుంపుగా వచ్చారు. వీళ్లంతా పోడు భూములు సాగు చేసుకునేవాళ్లు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు శ్రీనివాసరావు, రామారావులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ గుత్తి కోయలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న వాళ్లంతా కత్తులు, గొడ్డళ్లతో మూకుమ్మడిగా దాడికి దిగారు.

గుత్తి కోయల దాడి నుంచి రామారావు తప్పించుకోగలిగారు. కానీ, శ్రీనివాసరావు ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హుటాహుటిన చుంద్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గం మధ్యలోనే శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. బాధ్యులను మాత్రం అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు దాడికి వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. కేసు విషయంలో తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలంటూ నివేదికను కోరింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి