iDreamPost

13 సంవత్సరాల తర్వాత రంజీ ఫైనల్‌లో అడుగుపెట్టిన బెంగాల్ జట్టు

13 సంవత్సరాల తర్వాత రంజీ ఫైనల్‌లో అడుగుపెట్టిన బెంగాల్ జట్టు

దేశవాళి క్రికెట్ పోటీలలో ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో బెంగాల్ జ‌ట్టు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధించింది. మంగ‌ళ‌వారం ముగిసిన సెమీ ఫైనల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో నిండిన క‌ర్ణాట‌క జ‌ట్టును 174 ప‌రుగుల‌తో ఓడించింది.దీంతో 2006-07 రంజీ సీజ‌న్ త‌ర్వాత 13 సంవత్సరాల అనంతరం తొలిసారి బెంగాల్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టింది. కోల్‌కతాలో జ‌రిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మజుందార్ (149 నాటౌట్) సెంచ‌రీతో రాణించగా బెంగాల్ 312 ప‌రుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన క‌ర్ణాట‌క‌ జట్టు 122 పరుగులకు ఆలౌట్ కావడంతో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 190 ప‌రుగుల భారీ ఆధిక్యతను సంపాదించింది.ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ మిథున్ (4/23), స్పిన్నర్ గౌతమ్(3/15) లతోపాటు మోర్ కూడా రెండు వికెట్లు పడగొట్టి అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేయటంతో బెంగాల్ కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతతో కలిపి ప్ర‌త్య‌ర్థి జట్టుకు క‌ష్ట‌సాధ్య‌మైన 352 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.భారీ లక్ష్య ఛేదనలో బ్యాట్స్‌మన్‌ల వైఫల్యంతో రెండో ఇన్నింగ్స్‌లో క‌ర్ణాట‌క 177 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.బెంగాల్ ఫేస్ బౌలర్ ముఖేశ్‌ కుమార్ ఆరు వికెట్లు పడగొట్టి క‌ర్ణాట‌క‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అత‌నికి స్పిన్నర్ ఆకాష్ దీప్ (2/44) చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు.

చివ‌రిసారిగా 1989-90 సీజ‌న్‌లో బెంగాల్‌ రంజీ ట్రోఫీని సాధించింది.ఆ సీజ‌న్‌లోనే ప్ర‌స్తుత బీసీసీఐ అధ్య‌క్షుడు, భార‌త మాజీ కెప్టెన్‌ సౌర‌వ్ గంగూలీ అరంగేట్రం చేయ‌డం విశేషం.మ‌రోవైపు రాజ్ కోట్ మైదానంలో జరుగుతున్న గుజ‌రాత్‌-సౌరాష్ట్ర జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న తొలి సెమీస్ విజేత‌తో ఫైనల్లో బెంగాల్ త‌ల‌ప‌డ‌నుంది.86వ సీజన్ రంజీ ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ ఈనెల 9 నుంచి జరగనున్నది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి