iDreamPost

నంద్యాలలో ఆటో డ్రైవర్‌ కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు ఐపీఎస్‌లతో విచారణ

నంద్యాలలో ఆటో డ్రైవర్‌ కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు ఐపీఎస్‌లతో విచారణ

ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్ధుల్‌ సలాం (45) జీవితం విషాదాంతమైంది. దొంగతనం కేసు మోపి, ఒత్తిళ్లుకు గురి చేయడంతో ఆయన తన భార్య నూర్జహాన్‌ (38),కుమార్తె సల్మా (15) కుమారుడు దాదా కలందర్‌ (12) కలసి మంగళవారం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కౌలురు సమీపంలోని రైలు కింద పడి చనిపోయిన ఘటనలో అనేక కోణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.

అబ్ధుల్‌ సలామ్‌ కుటుంబం చనిపోయినప్పుడు ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. రైల్వే పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరిపారు. బంధువులు మాత్రం దొంగతనం కేసులో అబ్ధుల్‌ సలాంను వేధించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలోనూ వైరస్‌ చేశారు. శనివారం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్‌ రెడ్డి బాధిత బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు.. సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియోను బంధువులు ఎమ్మెల్యేకు చూపించారు.

”ఆటోలో జరిగిన 70 వేల దొంగతనం కేసు, బంగారం షాపులో జరిగిన దొంగతనం కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నేను చేయని దొంగతనంలో నన్ను వేధిస్తున్నారు. నాపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం. నాకు చావు తప్పా మరే దారి లేదు. మా చావుతోనైనా మీరు ప్రశాంతంగా ఉండండి’’ అంటూ సలాం తన సెల్పీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.

అబ్ధుల్‌ సలాం 1992 నుంచి నంద్యాలలో ఓ బంగారు నగల విక్రయ దుకాణంలో పని చేస్తున్నారు. అక్కడ సలాంపై దొంగతనం అభియోగం నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయన భార్య నూర్జహాన్‌ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. కరోనా వల్ల ఆమె ఉద్యోగం కూడా పోయింది. 42 రోజుల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన సలాం.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సలాం ఆటోలో ఓ ప్రయాణికుడు తాను 70 వేలు పోగొట్టుకున్నానని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ పోలీసులు సలాంను పిలిచి విచారించారు. ఆ తర్వాతనే సలాం కుటుంబంతో కలసి నంద్యాల నుంచి పాణ్యం మండలం కౌలూరు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను విచారణ నిమిత్తం ప్రత్యేకంగా నియమించింది. ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీ శంకబ్రత బాగ్ఛి, గుంటూరు అదనపు ఎస్పీ ఆరీఫ్‌లు విచారణ ప్రారంభించారు. సలాం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నంద్యాల సీఐ సోమశేఖరరెడ్డిని విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్‌లో ఉంచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి