iDreamPost

పెన్ష‌న్ల పంపిణీలో కొత్త అధ్యాయం, దేశం దృష్టిని ఆక‌ర్షించిన జ‌గ‌న్ స‌ర్కార్

పెన్ష‌న్ల పంపిణీలో కొత్త అధ్యాయం, దేశం దృష్టిని ఆక‌ర్షించిన జ‌గ‌న్ స‌ర్కార్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనేక కీల‌క మార్పుల‌తో పాల‌న‌లో స‌మూల మార్పుల‌కు ప్ర‌య‌త్నిస్తోంది. గ్రామ, వార్డు స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌, వాలంటీర్ల నియామ‌కం వంటివి అందులో కొన్ని. ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటుతో ఇప్పుడు ప‌లు విష‌యాల్లో ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ పూర్తిగా త‌గ్గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా పెన్ష‌న్ల పంపిణీ ప్ర‌క్రియ‌ను గ‌మ‌నిస్తే తెలుస్తోంది. ఒక్క రోజులోనే సుమారు 90 శాతం మంది పేద‌ల‌కు పెన్ష‌న్లు అందించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే గాక‌, కొత్త చ‌రిత్ర‌గా మారుతోంది. దేశంలో అనేక మంది దృష్టికి ఈ వ్య‌వ‌హారం చేరింది. ప‌లువురు ఈ వ్య‌వ‌స్థ‌ను ప‌రిశీలించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌డం విశేషం.

దేశంలో పేద‌ల‌కు పెన్ష‌న్ల ద్వారా సంక్షేమం చేసేందుకు స‌ర్కారు ప్ర‌య‌త్నించ‌డం చాలాకాలంగా ఉంది. ఏపీలో కూడా కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయంతో నేరుగా పేద‌లకు నెల నెలా పెన్ష‌న్లు అందించే ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. తొలుత చంద్ర‌బాబు సీఎంగా కాలంలో ఈ పెన్ష‌న్లు నెల‌ల త‌ర‌బ‌బ‌డి పెండింగ్ లో ఉండేవి. నాలుగు, ఐదు నెల‌ల‌కు ఒక‌సారి పెన్ష‌న్లు అందించిన అనుభ‌వం కూడా ఉంది. ఆ త‌ర్వాత వైఎస్సార్ హ‌యంలో దానిని స‌రిదిద్ది, ప్ర‌తీ నెలా పెన్ష‌న్లు అందించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత అది క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కావ‌డంతో గ‌త ద‌శాబ్దంన్న‌ర‌గా ఏపీలో వృద్ధులు, వితంతులు, వికలాంగుల‌కు ప్ర‌తీనెలా పెన్ష‌న్లు అందిస్తున్నారు. అయితే పంపిణీ విష‌యంలో గ‌త ప్ర‌భుత్వాల‌కు భిన్న‌మైన ప‌ద్ధ‌తిని జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. వాలంటీర్ల స‌హాయంతో ల‌బ్ధిదారుల ఇంటి వ‌ద్దనే పెన్ష‌న్లు అందించే విధానానికి శ్రీకారం చుట్టారు. రెండు నెల‌లుగా ప్రారంభించిన ఈ ప్ర‌క్రియ‌లో తొలుత కొంత స‌మ‌స్య‌లు త‌ప్ప‌లేదు. వాటిని వేగంగా స‌రిదిద్ది స‌మ‌గ్ర చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డంతో ఇప్పుడు ప‌రిస్థితి దాదాపు స‌ర్థుమణిగింది.కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది. ఒక్క రోజులోనే 87 శాతం పెన్ష‌న్లు పేద‌ల‌కు చేర‌డం అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

పెన్ష‌న్ల‌ను తొలుత పంచాయితీ ఆఫీస్ వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూసినా ఎప్పుడు చేతికి అందుతుందో తెలియ‌క స‌త‌మ‌తం అయిన ల‌బ్ధిదారులు ఇప్పుడు ఆసుప‌త్రిలో ఉన్నా, పొలం ప‌నిలో ఉన్నా, ఎక్క‌డ ఉన్నా త‌మ‌కే తెచ్చి ఇస్తున్న ప్ర‌భుత్వ విధానం ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజ‌న ప్రాంతాల్లో కిలోమీట‌ర్ల కొద్దీ దూరం న‌డిచి వ‌స్తే అక్క‌డ పంచాయితీ సిబ్బంది లేక‌పోతే వికలాంగులు, వృద్ధుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారికి ఇప్పుడు ఒక‌టో తేదీనే పెన్ష‌న్ సొమ్ము చేతికి తీసుకొచ్చి అందించే వ్య‌వ‌స్థ ఏర్ప‌డ‌డంతో కొండంత ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. ఇక డ‌యాలిసిస్ పేషెంట్లు ఇత‌రులు కూడా ఆఫీసుకి వ‌చ్చి వేలిముద్ర‌లు వేయాల‌నే ప‌రిస్థితి నుంచి వారి బెడ్ వ‌ద్ద‌కు వెళ్లి పెన్ష‌న్లు పంపిణీ చేస్తున్న విధానం సంక్షేమం కొత్త పుంత‌లు తొక్కేందుకు దారితీస్తోంది.

బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించాల‌నే ఆలోచ‌న చేసిన‌ప్ప‌టికీ దాని మూలంగా మారుమూల ప్రాంతాల్లో బ్యాంకులు అందుబాటులో లేని వారు , నిర‌క్ష‌రాస్యులు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వాలంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా పెన్ష‌న్లు అందించ‌డానికి పూనుకోవ‌డం ఇప్పుడు వివిధ రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌ప్రాయంగా మారుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ నూత‌న విధానాన్ని అధ్య‌య‌నం చేసేందుకు ప‌లు బృందాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఆచ‌ర‌ణాత్మ‌క మోడ‌ల్ గా ఏపీ ప్ర‌భుత్వం నిల‌వ‌డంతో వివిధ యూనివ‌ర్సిటీలు, ప‌రిశోధ‌నా సంస్థ‌లు కూడా కొత్త విధానంపై స‌మ‌గ్ర రిపోర్టులు త‌యారు చేసేందుకు రంగంలో దిగుతున్నారు. పేద‌ల‌కు పెన్ష‌న్లు ప్ర‌తీ ఏటా పెంచేందుకు ప్ర‌భుత్వం సిద్ధం కావ‌డం, ఆ పెన్ష‌న్లు ప్ర‌తీ నెలా ఒక‌టి నాడే అందించ‌డం, దానిని కూడా నేరుగా ల‌బ్ధిదారుల ఇంటికి చేర్చేందుకు చేప‌డుతున్న చ‌ర్య‌లు ఇప్పుడు అంద‌రూ ఆచ‌రించేందుకు ఆంద్ర‌ప్ర‌దేశ్ రోల్ మోడ‌ల్ అవుతోంద‌ని అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి