iDreamPost

విశాఖకు రాజధాని హంగులు

విశాఖకు రాజధాని హంగులు

అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహా నగరంగా ఎదుగుతున్న విశాఖపురికి మరిన్ని కొత్త హంగులు కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. విద్య, సాంస్కృతిక, పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి బాటలు వేస్తోంది. మంగళవారం ఒక్క రోజే సీఎం జగన్ ఆదేశాల మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

పెరిగిన మెట్రో ప్రాంత పరిధి

విశాఖను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు వుడా స్థానంలో వీఎంఆర్డీఏ(విశాఖ మెట్రో రీజియన్ అభివృద్ధి సంస్థ)ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా విశాఖ జిల్లాలోని మరో 13 మండలాలను వీఎంఆర్డీఏ పరిధిలో చేర్చింది. ఈ మండలాల్లోని 431 గ్రామాలను చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏజెన్సీ ప్రాంతం మినహా విశాఖ జిల్లా మొత్తం వీఎంఆర్డీఏ పరిధిలో చేరింది. ఈ నిర్ణయం వల్ల ఆయా ప్రాంతాలను అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు వీలవుతుంది. మరోవైపు విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని మంగళవారం అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి భోగాపురం వరకు 76 కిలోమీటర్ల నిదివిన 53 స్టేషన్లతో నిర్మించాలని నిర్ణయించారు. 14వేల కోట్ల అంచనతో డీపీఅర్ సిద్ధమైన విషయాన్ని అధికారులు ఆయనకు చెప్పారు. ట్రామ్ రైల్ శైలిలో డిజైన్లు రూపొందించాలని జగన్ వారికి సూచించారు.

అమెరికన్ కార్నర్

విశాఖతో పాటు రాష్ట్రంలో విద్యా వికాసానికి, యువతలో నైపుణ్యాభివృద్ధికి వీలుగా ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటుకు ఆమెరికన్ కాన్సలేట్ తో ఏయూ ఒప్పందం కుదుర్చుకుంది. గత జనవరిలో సీఎం జగన్ తో హైదరాబాద్ లోని అమెరికా కాన్సలేట్ జనరల్ రిఫ్ మన్ సమావేశమైనప్పుడు
తీసుకున్న నిర్ణయం మేరకు.. మంగళవారం అమెరికన్ కాన్సలేట్, ఏయూ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ వేసవి సీజన్ నుంచే దీని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఆంగ్ల భాష, డిజిటల్ స్కిల్స్, అమెరికాలో విద్య, ఉద్యోగావకాశాలపై నిరంతరం వర్క్ షాప్ లు, అవగాహన తరగతులు నిర్వహిస్తారు. ఇరుదేశాల సంస్కృతి సంప్రదాయాలపై సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు.

రుషికొండ రిసార్టుకు 92 కోట్లు

పర్యాటకాభివృద్ధిలో భాగంగా రుషికొండ రిసార్ట్ పునర్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.92 కోట్లు విడుదల చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. అలాగే సాగర తీరంలో నౌకా రెస్టారెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బీచ్ రోడ్ లో కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, యుద్ధ విమాన మ్యూజియం పర్యాటకులను అలరిస్తుండగా.. నౌకా రెస్టారెంట్ ఆదనపు ఆకర్షణ కానుంది. ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి, మంగమారిపేట బీచ్ లను గోవా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి