iDreamPost

హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ హైకోర్టులో ఈ రోజు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా తిరిగి తనను నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆయన ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, ఎన్నికల కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చారు. నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ ఎప్పుడు జరుపుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా, నిమ్మగడ్డ వ్యవహారం ప్రస్తుతం సుప్రిం కోర్టులో ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సుప్రిం ధర్మాసనం ప్రతివాదిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు ప్రకారం గవర్నర్‌.. ఎస్‌ఈసీగా కనగరాజ్‌ను నియమించడం చెల్లదంటూ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోలను రద్దు చేస్తూ తిరిగి ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీని నియమించే అధికారం తమకు లేనప్పుడు తిరిగి ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను ఎలా అపాయింట్‌ చేయగలమే సందేహాన్ని ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. రమేష్‌కుమార్‌ నియమాకం కూడా గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ సిఫార్సు మేరకే జరిగింది కాబట్టి ఆయన నియామకం కూడా చెల్లదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంపై దాఖలైన కో వారంటో పిటిషన్‌ను హైకోర్టు నిన్న విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు తీర్పు మేరకు తిరిగి తాను ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు తనకు తాను ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. బీజేపీ నేతలైన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ అయిన వీడియోలు లీక్‌ కావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతోంది. టీడీపీ, వైసీపీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. కాగా, రమేష్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉండి ఉంటే.. ఆయన ఆ పదవిలో వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగేవారు. 2021 మార్చి నెలాఖరుకు ఆయన పదవి చేపట్టి ఐదేళ్లు పూర్తవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి