iDreamPost

అంటే మాట తప్పేశారుగా !

అంటే మాట తప్పేశారుగా !

థియేటర్ కు ఓటిటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటేనే కలెక్షన్లు పెరుగుతాయని నిర్మాతలు భావిస్తున్న తరుణంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది వ్యవహారం. గత నెల 10న విడుదలైన అంటే సుందరానికి ప్రమోషన్ టైంలో తమ సినిమా అంత త్వరగా డిజిటల్ లో రాదని నానితో పాటు దర్శకుడు వివేక్ ఆత్రేయ నొక్కి చెప్పారు. కట్ చేస్తే వచ్చే పదో తేదీనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సరిగ్గా ముప్పై రోజులన్న మాట. కమర్షియల్ గా అంటే సుందరానికి ఫెయిల్యూర్ కిందికే వస్తుంది. డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో రూపొందించినప్పటికీ లెన్త్ ఎక్కువైన ఈ లవ్ డ్రామా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేక దెబ్బ తింది.

ఇదే కాదు అందరి చేత ప్రశంసలు దక్కించుకుని మంచి వసూళ్లు రాబట్టుకున్న మేజర్ నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చింది. దీనికిచ్చిన గ్యాప్ కూడా ముప్పై రోజులే. ఇంకో అయిదు రోజుల్లో కమల్ హాసన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విక్రమ్ ని తీసుకొస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ నిర్మాతలు ఈ ఓటిటి డీల్స్ కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫిఫ్టీ డేస్ తర్వాతే డిజిటల్ కు ఇవ్వాలనేది అందులో ప్రధానమైన డిమాండ్. దీనికి ప్రొడ్యూసర్లు ఏ మేరకు కట్టుబడతారనేది అనుమానమే. ఇప్పటికే కొందరు మళ్ళీ చర్చించాలని అంటున్నారు. వినడానికి బాగానే ఉన్నా ఇంప్లిమెంట్ చేసే క్రమంలో చిక్కులొస్తాయని చెబుతున్నారు.

మొత్తానికి ఇదంత సులభంగా తేలే పంచాయితీ కాదు. వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లాంటి వాటికే రెండు నెలల లైఫ్ లేదు. అలాంటిది మీడియం బడ్జెట్ లేదా ఓ ఇరవై కోట్లు ఖర్చైన సినిమాలకు ఈ కండీషన్లు పెడితే ఓటిటిలు తాము ఆఫర్ చేసే మొత్తంలో భారీ కోత విధిస్తాయి. ఇది సేఫ్ గేమ్ అనిపించుకోదు. గతంలో ఇలాగే ఈ నిబంధన తీసుకొచ్చారు కానీ తర్వాత అంతా తూచ్ అనేశారు. ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారన్న నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లోనే అంతగా లేదు. దీని తాలూకు పరిణామాలు ఫలితాలు చూడాలంటే మాత్రం ఇంకో అయిదారు నెలలు వేచి చూస్తే క్లారిటీ వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి