iDreamPost

విశ్లేషకుల్లారా ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త..

విశ్లేషకుల్లారా ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త..

“నాలుక కోస్తా”, “నిలువు పాతరేస్తా”, ‘మళ్ళీ మాట్లాడితే నీ అసలు పురాణం వినిపిస్తా”

“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది? ఈమాటలు రోజూ వినీ వినీ చాలా కంపరంగా ఉంటోంది” అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.

ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో ఏదైనా అప్రాచ్యపు పదంఒక్కటి దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మదన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.

త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు. “చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం ఇలా అస్తమానం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు. దానికి సీత జవాబుగా అన్నట్టు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.

ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం మరింత రూపు మార్చుకుంది. నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణా దులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.

ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది. విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి….అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔనని తలూపుతున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది? పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు. “అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో. ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు. “క్రమక్రమముగా కొలువుకూటము రణకూటమగుచున్నది, పదువురుండగనే నా మాటలాలకింపుడు” అంటాడు పాండవుల పనుపున దూతగా వచ్చిన శ్రీకృష్ణుడు కౌరవసభలో ధృతరాష్ట్రుడితో.

సమరాంగణంగా మారుతున్న రాజకీయ రంగాన్ని చూస్తున్నప్పుడు పాండవోద్యోగ విజయాల్లో కృష్ణుడి మాటలు జ్ఞాపకం రాకమానవు. దీపావళి బాణసంచా ధ్వనులు చిన్నబోయేలా రాజకీయ నాయకుల మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ఉవ్వెత్తుతున్నాయి. ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. ఎవరివాదాన్ని వారు బలంగా వినిపించే ధోరణితో పేట్రేగిపోతూ మీడియాలో చర్చలు దారితప్పుతున్నాయి. ఒకరు చెప్పేది మరొకరు వినిపించుకోరు. తమ మాటే వినాలని, తమ ప్రశ్నకే జవాబు చెప్పి తీరాలని, అ సమాధానం కూడా తమకు అనుకూలంగా వుండాలని పట్టుబట్టే పెడధోరణి జడలు విప్పుకుంటోంది. ఈ వేడిలో, వాడిలో వివేచన వెనక్కు తప్పుకుంటోంది. తప్పు మీదంటే మీదంటూ పరస్పరం బురద చల్లుకునే క్రమంలో తప్పు చేయడం అసలు తప్పేకాదన్న రీతిలో భాష్యాలు చెబుతున్నారు. అధినాయకులే యుద్ధరంగంలో దిగి సమర శంఖాలు పూరిస్తూ వుండడంతో కధ క్లైమాక్స్ కు చేరుతోంది.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అనుచర గణాలు ఈ విషయంలో నాయకులను మించి గొంతులు పెంచి నానా యాగీ చేస్తున్నాయి. టీవీ చర్చలకు వెళ్ళే రోజుల్లో చర్చకు వచ్చిన ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిర్మొహమాటంగా చెప్పాడు, ‘ఈ విషయంలో జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి’ అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది ఎంత అప్రదిష్ట. రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అవకాశం కోసం అర్ధం కానట్టు వుండిపోతున్నారు అనుకోవాలి.

ఏవిషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందు రాజకీయం అనే రక్కసి అందులో చేరి పడగలు విప్పుతోంది. దాంతో ప్రతిదీ రాజకీయమయం అయిపోతోంది. ఎవడో ఒకడు ఒక నేరం చేస్తాడు. లేదా చట్టాన్ని ఉల్లంఘిస్తాడు. అతడు ఏదో ఒక పార్టీవాడు అయితే ఇక అంతే సంగతులు. ఆ పార్టీ అతడికి కొమ్ము కాస్తుంది. వెంటనే ఎదుటి పక్షం తన పల్లవి తాను అందుకుంటుంది. ఇలా రాజకీయం రంగ ప్రవేశం చేయడంతో ఆ మనిషి చేసిన నేరం కాస్తా నేపధ్యంలోకి వెళ్ళిపోతుంది. ఇలాటి విషయాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రతి పార్టీ చేసే పని ఇదే. నేరం చేసిన వాడు పరాయి వాడు అయితే, ‘చట్టం తన పని తను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అంటూ బుడిబుడి రాగాలు తీస్తారు. తమవాడే అయితే ‘చట్టం పాలకుల చేతిలో చుట్టం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. తప్పుచేసిన వాడిని పోలీసులు విచారిస్తే, అది సరికాదంటూ సీబీ సీఐడీ దర్యాప్తు కోసం గగ్గోలు పెడతారు. సీబీ సీఐడీ విచారణ చేస్తుంటే, అది ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ, సీ బీ ఐ దర్యాప్తు అంటారు. సీబీఐ పరిస్తితీ ఇంతే, అది కేంద్రం చేతిలో ఆటబొమ్మ అంటారు. ఇలా వ్యవస్థలను భ్రష్టుపట్టించే అసంబద్ధ ఆరోపణలు చేస్తూ విచారణను నీరుకారుస్తారు. నేరారోపణలు ఎదుర్కున్న వ్యక్తులు కొన్నాళ్ళ తరువాత హాయిగా జనం మధ్యే తిరుగుతుంటారు. ఇదీ కొన్నేళ్లుగా జరుగుతున్న కధ. ఇప్పుడు నడుస్తున్న కధ కూడా దానికి పొడిగింపే.

ముందు చెప్పినట్టు బియ్యంలో రాళ్ళు కలగలసిపోయినట్టు ఈ నాడు నేరాలు, రాజకీయాలు జమిలిగా ముడి పడిపోయాయి. వీటిని విడదీసే జల్లెడలు లేవు. వున్నా రాజకీయ పార్టీలకి వాటి అవసరం లేదు. వాళ్లకి కావాల్సిందల్లా తమ వాళ్ళను కాపాడుకోవడం, వాళ్లు నేరస్తులయినా ఒకటే, కాకపోయినా ఒకటే. ఎదుటివాడయితే చేతిలో వున్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులు పెట్టడం. మనవాడయితే వాటినుంచి బయటపడవేయడం. ఇదే నేటి రాజకీయ ధర్మం. ‘ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుంద’ని ఉవాచ. రాజకీయ పార్టీలు కూడా తాము నమ్మిన ‘ఆ ధర్మమే’ తమను కాపాడుతుందని భావిస్తూ తాము పెంచి పోషిస్తున్న ‘అధర్మాన్నే’ సదా కాపాడుతూ పోతుంటారు.

తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. జర్నలిస్టులు పుడతారు. సంపాదకులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి.

అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు స్వచ్చందంగా అడ్డుకట్ట వేసుకోవాలి. సహేతుక విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు సరైన అవకాశం లభించేలా పాలక పక్షం బాధ్యత తీసుకోవాలి. లభించిన అవకాశాన్ని ఆరోపణల పేరుతో సభా సమయం వృధా చేయని తత్వాన్ని ప్రతిపక్షాలు అలవరచుకోవాలి. అదేసమయంలో, సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమవంతు కర్తవ్యాన్ని నలుగురూ కలసి కలసికట్టుగా నిర్వర్తించినప్పుడే ప్రజాస్వామ్య సౌధ పునాదులు నాలుగు కాలాలపాటు పటిష్టంగా మనగలుగుతాయి.

‘నైతిక హక్కు, చిత్తశుద్ధి, ప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు. మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.

ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతు నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, అసలు ఏ పార్టీకి చెందనివాళ్ళు, రాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.

Written By- Bhandaru Srinivasa Rao

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి