iDreamPost

కెప్టెన్‌ ఓడిపోయారు..!

కెప్టెన్‌ ఓడిపోయారు..!

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సొంతంగా పార్టీ పెట్టుకుని, బీజేపీతో కలసి బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ఓడిపోయారు. పాటియాల నుంచి బరిలోకి దిగిన ఆయన ఓటమి చవిచూశారు. ఆప్‌ అభ్యర్థి అజిత్‌పాల్‌ కోహ్లి కెప్టెన్‌పై విజయం సాధించారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్‌ తనను అవమానించిందంటూ.. ఆ పార్టీని వీడారు. బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగినా.. సొంతంగా పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో.. బీజేపీ పెద్దల సూచన మేరకే కెప్టెన్‌ పార్టీని ఏర్పాటు చేసి, బీజేపీతో జతకట్టారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కెప్టెన్‌ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్, బీజేపీ కూటమి ప్రస్తుతం ఒక చోట గెలుపొందింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. స్వయంగా అమరిందర్‌ సింగ్‌ ఓటమిపాలవడం గమనార్హం.

పంజాబ్‌పై ఆప్‌ జెండా ఎగరడం ఖాయమైంది. ఆ పార్టీ భారీ మెజారిటీ దిశగా వెళుతోంది. 117 సీట్లు ఉన్న పంజాబ్‌లో ఇప్పటికే ఆప్‌ మూడు చోట్ల విజయం సాధించింది. మరో 89 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. రౌండ్‌ రౌండ్‌కు ఈ ఆధిక్యం పెరుగుతోంది. ఈ క్రమంలో ఆప్‌ 90కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రెండు చోట్ల విజయం సాధించింది. మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. శిరోమణి అకాళిదల్‌ ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

ఆప్‌ విజయం ఖాయమైన వేళ కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా నిర్ణయాన్ని దైవ నిర్ణయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

పంజాబ్‌ ఫలితాలపై ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. పంజాబ్‌ ప్రజలు విప్లవం సృష్టించారని వ్యాఖ్యానించారు. విప్లవం సృష్టించిన పంజాబ్‌ ప్రజలకు అభినందనలు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి