iDreamPost

సీఎంపై అనుచిత పోస్టు : అమరావతి ఎంపీడీవోపై వేటు

సీఎంపై అనుచిత పోస్టు : అమరావతి ఎంపీడీవోపై వేటు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అనుచిత పోస్టు పెట్టారనే అభియోగంపై మరో ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. సీఎంకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతోపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా దుకాణాలు, వ్యాపార సంస్థలకు అనుమతి ఇచ్చినందుకు అమరావతి ఎంపీడీవో పావులూరి ఉమాదేవి సస్పెండ్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ శ్యామూల్‌ ఆనంద్‌ కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉమాదేవి ప్రభుత్వ పథకాలు, విధానాలను బాహాటంగా విమర్శించారనే ఆరోపిస్తూ వైసీపీ నాయకులు అమరావతిలో ధర్నా చేశారు. అమెను బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.

విచారణ జరిపిన పంచాయతీ రాజ్‌ ఉన్నతాధికారులు.. ఆమెను అప్రాధాన్య పోస్టులో నియమించాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమెను ఎంపీడీవో పోస్టు నుంచి జిల్లా కలెక్టర్‌ మే 22వ తేదీన రిలీవ్‌ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేసేందుకు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆర్టీవోను పంపారు. విచారణ సమయంలో ఎంపీడీవో ఉమాదేవీ తన పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆర్డీవో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీడీవో ఉమాదేవిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ గత నెల 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రభుత్వ విధానాలను, పథకాలను విమర్శించకూడదనే విషయం తెలిసినప్పటికీ పలువురు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఉద్యోగానికి ఎసరు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే గుంటూరుజిల్లా సెంట్రల్‌ బ్యాంక్‌ ఏజీఎం కూడా సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సస్పెండ్‌కు గురయ్యారు. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి గ్రూప్‌ 1 స్థాయి అధికారి వరకూ పలువరు ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజలు చేసే ఫిర్యాదులతోపాటు సోషల్‌ మీడియాపై నిఘా పెట్టిన సీఐడీ, పోలీసులు అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి