iDreamPost

అగ్రగామిగా ‘‘కోనసీమ’’ జిల్లా

అగ్రగామిగా ‘‘కోనసీమ’’ జిల్లా

అటు వ్యవసాయం.. ఇటు సహజ వనరులు… చుట్టూ గోదావరి.. సముద్ర తీరం. కొత్తగా ఏర్పడబోయే కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన జిల్లాగా మారనుంది. ఇక్కడ పండే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పౌల్ట్రీ ఉత్పత్తులు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయి. ఇక కృష్ణా ` గోదావరి బేసిన్‌ (కేజీ బేసిన్‌) చమురు, సహజవాయువుల ఉత్పత్తిలో దేశానికే తలమానికంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో భాగంగానే ఉన్న సమయంలోనే అభివృద్ది చెందిన ఈ ప్రాంతం కొత్తగా జిల్లాగా మారడంతో అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కబోతోందని ఈ ప్రాంత వాసులు ఆశిస్తున్నారు. 

ఎటుచూసినా పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే వరిచేలు… నిలువెత్తు కొబ్బరి తోపులు.. వాటి మధ్య కోకో.. అరటి.. పసుపు.. కంద.. వంటి ఉద్యాన పంటలు.. తీరం పొడవునా వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు… తూర్పుడెల్టా పరిధిలో లక్షలాది కోడిగుడ్ల ఉత్పత్తి… లక్షల లీటర్ల పాలవెల్లువ. ఇలా వ్యవసాయరంగంలోనే కాదు. కోట్ల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు. ట్రిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌.. గోదావరి నదీపాయల మధ్య అంతులేని ఇసుక సంపద. ఇలా ఎలా చూసినా కొత్తగా ఏర్పడబోయే కోనసీమ ఆదాయంలో అక్షయపాత్రగా మారనుంది.

గోదావరి మధ్యడెల్టా పరిధిలో అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలు, తూర్పు డెల్టా పరిధిలో రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలు కోనసీమ జిల్లాలో ఉండనున్నాయి. మధ్యడెల్టా పరిధిలో 1.80 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుండగా, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలో మరో 60 వేల ఎకరాల్లో సాగు ఉంది. మొత్తం మీద రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు 2.40 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. ఇక్కడ ఖరీఫ్‌లో సుమారు 5.40 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 8.10 లక్షలు కలిపి మొత్తం 13.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండనుంది. ఇది కాకుండా మూడవ పంటగా అపరాలు కూడా పండుతాయి. జిల్లాలో పెద్ద పెద్ద రైస్‌ మిల్లులన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి.

కొత్తగా ఏర్పడే జిల్లాలో సుమారు 93 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. సగటున 65.10 కోట్ల కాయలు దిగుబడిగా వస్తోంది. కొబ్బరిలో అంతర పంటగా సుమారు 30 వేల ఎకరాల్లో కోకో పంట, కొబ్బరిలో అంతర పంటగాను, విడిగాను 60 వేల ఎకరాల్లో అరటి, 20 వేల ఎకరాల్లో ఇతర ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. గోదావరి లంక ప్రాంతాలతోపాటు, ఇతర ప్రాంతాల్లో కలిపి సుమారు 20 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు పండుతున్నాయి. ఇవి కాకుండా ఆయిల్‌ఫామ్‌, కంద, పసుపు, ఆయిల్‌ఫామ్‌, బొప్పాయి, పొగాకు పంటలు పండుతున్నాయి.

Also Read : ఏపీకి “కొత్త” క‌ళ.. ఆస‌క్తిక‌ర అంశాలు..!

కోస్తాలో ఆక్వాకు కోనసీమ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. 50 వేల ఎకరాల్లో చేపలు సాగు, మరో 30 వేల ఎకరాల్లో వెనామీ రొయ్యల సాగు జరుగుతుంది. ఇది కాకుండా విస్తారంగా ఉన్న సముద్రతీరం వల్ల అంతర్వేది, ఓడలరేవు, మట్లపాలెం, బలుసుతిప్ప వంటి ప్రాంతాలకు చెందిన వందల మంది మత్స్యకారులు వేటాడి తెచ్చే చేపలు, రొయ్యలు, పీతలు సైతం యూరోపియన్‌ దేశాలతోపాటు చైనా, రష్యావంటి ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఏడాదికి ఇక్కడ నుంచి సుమారు 25 వేల కోట్ల రూపాయిల మత్స్య ఉత్పత్తి జరుగుతోందని అంచనా. కొబ్బరి, కొబ్బరి ఉత్పత్తులు సైతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా దేశానికి వేల కోట్ల విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది. పౌల్ట్రీలో సైతం ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. మండపేట, రాయవరం, ఆలమూరు వంటి ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 50 లక్షల కోడిగుడ్లు పశ్చిమ బెంగాల్‌, ఒడిస్సా వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

దేశంగా ఉత్పత్తి అవుతున్న చమురు, సహజ వాయువుల ఉత్పత్తిలో కేజీ బేసీన్‌ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీతోపాటు గెయిల్‌ కోట్ల రూపాయల ముడి చమురు, సహజవాయువులను ఉత్పత్తి చేస్తోంది. వీటితోపాటు ప్రైవేట్‌ సంస్థలైన రిలయన్స్‌, రవ్వ, జీఎస్‌పీఎస్‌ వంటి సంస్థలు కూడా ఏళ్ల తరబడి ఇక్కడ చమురు, సహజవాయువు ఉత్పత్తి చేస్తున్నాయి. తాళ్లరేవు మండలం గాడిమొగ వద్ద రిలయన్స్‌, జిఎస్‌పీఎస్‌, ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో రవ్వ, అల్లవరం మండలం ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ టెర్మినల్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా వేల కోట్ల చమురు, సహజవాయువుల ఉత్పత్తి జరుగుతోంది. ఇవి కాకుండా తాటిపాక వంటి ప్రాంతాల్లో ఓఎన్జీసీ గ్యాస్‌ కలెక్షన్‌ స్టేషన్లు ఉన్నాయి.

గోదావరి నదీపాయల మధ్య ఉన్న కోనసీమ జిల్లాకు మరో వరం అపారమైన ఇసుక మేటలు. ధవళేశ్వరం బ్యారేజ్‌ దిగువున ఉన్న అన్ని ప్రధాన ఇసుక రీచ్‌లు కోనసీమ పరిధిలోకే వస్తాయి. రావులపాలెం, గోపాలపురం, అంకంపాలెం, జొన్నాడ, కోరుమిల్లి, కోటిపల్లి, మురమళ్ల, మందపల్లి, లంకల గన్నవరం, ఉడిమూడి, గంటి, సోంపల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద ఇసుక ర్యాంపులు ఈ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇలా వ్యవసాయం, సహజ వనరులతో కోనసీమ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా మారనుంది.

Also Read : దశాబ్ధాల కాలం నాటి కల.. సాకారం కాబోతున్న వేళ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి