iDreamPost

వైకుంఠపురం గుట్టు విప్పేశారు

వైకుంఠపురం గుట్టు విప్పేశారు

ప్రత్యేక అతిధులు లేకుండానే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్సర్ట్ మొన్న ఘనంగా జరిగింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ట్రైలర్ రాత్రి 9 దాటాక విడుదల చేసారు. కథ విషయంలో ఉన్న సస్పెన్స్ కు చెక్ పెడుతూ మెయిన్ పాయింట్ ని రివీల్ చేశారు. దాన్ని బట్టి చూస్తే బన్నీ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. నాన్న(మురళీశర్మ) చెప్పే సర్దుకుపోయే సిద్ధాంతానికి విరుద్ధంగా జీవితం గొప్పగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. 

ఆ టైంలోనే ఏదో ప్రత్యేకమైన కారణం వల్ల ధనవంతులైన జయరాం-టబుల కుటుంబంలోకి అడుగు పెట్టే ఛాన్స్ వస్తుంది. అంతేకాదు వాళ్ళ ఆఫీస్ లోనే చేరిపోయి వ్యవహారాలు చక్కదిద్దడం మొదలుపెడతాడు. అక్కడే ఓ బుట్టబొమ్మ లాంటి అమ్మాయి(పూజా హెగ్డే)తో ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఈలోగా విలన్(సముద్ర ఖని) ఎంట్రీ ఇస్తాడు. అసలు బన్నీ ఎందుకు వైకుంటాపురములోకి వెళ్లాల్సి వచ్చింది, అతని ప్రయాణం ఏ మజిలికి చేరుకుంది అనేదే కథగా కనిపిస్తోంది. 

ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్కు డైలాగులతో ట్రైలర్ సాఫీగా సాగిపోయింది. కానీ స్టోరీ లైన్ చూస్తే మాత్రం గతంలో వచ్చిన అల్లుడుగారు, రౌడీ అల్లుడు షేడ్స్ కనిపించడం గమనార్హం. పంచులు బాగానే పేలాయి. అయితే మాస్ కి వెంటనే కనెక్ట్ అయ్యే అంశాలు మాత్రం ట్రైలర్ లో పెద్దగా కనిపించలేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. ఫైట్స్ వగైరా పెట్టినా కంటెంట్ మాత్రం సాఫ్ట్ గానే ఉంది. అసలే మహేష్ రాయలసీమ కథతో పోటీ పడుతున్న బన్నీ మొత్తానికి అల వైకుంఠపురములోతో కూల్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. 
థమన్ మ్యూజిక్ ఇప్పటికే విపరీతంగా వైరల్ అయిపోయింది. 13 కోట్ల దాకా వ్యూస్ సాధించి ఈ మధ్యకాలంలో ఏ ఆల్బమ్  తెచ్చుకోలేనంత రెస్పాన్స్ దక్కించుకుంది. ట్రైలర్ పట్ల ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. అందులోనూ జులాయి – సన్ అఫ్  సత్యమూర్తి తర్వాత హీరో దర్శకుడి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ కావడంతో సెంటిమెంట్ పరంగా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి సంక్రాంతి బరిలో స్టైలిష్ స్టార్ ఏం చేస్తాడో తెలియాలంటే సంక్రాంతి దాకా 12 దాకా ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి