iDreamPost

జనగళమే జగన్ కు కోరస్

జనగళమే జగన్ కు కోరస్

2019 ఎన్నికల ఫలితాల తర్వాత మహా ఐతే ఒక నెల, నెలన్నర వదిలేసి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలా అయినా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ‘ఆంధ్రజ్యోతి’ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారో ప్రజలకు తెలియనిది కాదు. తన ‘కొత్త పలుకు’ను చదివినవారెవరికైనా ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. చంద్రబాబును ప్రజలు అన్యాయంగా ఓడించినట్టు, ప్రజలు తమ నిర్ణయానికి తామే బాధ్యత వహించాలంటూ దాదాపు శాపాలు పెట్టినంత పని చేశారు.ఇన్ని నెలల రాతల తర్వాత ఎన్ని జాకీలేసి లేపినా ఇక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడి మీద ప్రజల్లో సదభిప్రాయం కలగడం కల్లేనని ఆర్కేకు అర్ధమైనట్టు ఉంది . అందుకే ‘ఐ డ్రీమ్ పోస్ట్ ‘ గతంలో చెప్పినట్టే వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి ల మధ్య విభేదాలు సృష్టించడానికి ఆర్కే విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

“ఎన్ని ప్రయత్నాలు చేసినా వైరస్ ను అరికట్టలేకపోతున్నాం” అని జగన్ చెప్పిన విషయం, “వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కేంద్రం అభినందిస్తోంది” అని విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలు ‘పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ప్రజలకు అనిపిస్తే … ‘అంటూ ఒక రాయి వేశారు. చాలా స్పష్టంగా “ఎన్ని చేస్తున్నా వైరస్ ను అరికట్టలేకపోతున్నాము” అని వైఎస్ జగన్ చెప్పిన మాటకు అర్ధం దాన్ని అరికట్టేందుకు మన చేతుల్లో ఏమీ లేదని, వ్యాక్సిన్ వచ్చేంతవరకు మనం జాగ్రత్తగా ఉండడం ఒక్కటే చేయగలమని అర్ధం. ‘మామూలు జ్వరం లాంటిది, మందులేసుకుంటే తగ్గిపోతుంది’ అని జగన్ చెప్పడం కాదు – ప్రపంచవ్యాప్త బాధితుల, మృతుల నిష్పత్తి చెప్పే విషయం అదే. వీలైనంత ఎక్కువమంది స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడానికి నాయకుడనేవాడు ఎవరైనా నాలుగు మాటల ధైర్యమే చెబుతాడు కానీ లేనిపోని అపోహలు కలిగించి ప్రజల్ని మరింత నైరాశ్యంలోకి నెట్టడు.

“వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కేంద్రం అభినందిస్తోంది” అని విజయసాయిరెడ్డి ప్రకటించిన మాటకు అర్ధం – ఎవరికీ రాకుండా అరికట్టలేమనే మాట వాస్తవమే అయినా కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్రం అభినందించిందని. అది నిజం కనుకనే జాతీయ మీడియా సైతం పలుమార్లు ప్రశంసించింది. దేశవ్యాప్తంగా జరిగిన టెస్టుల సంఖ్యలో అధిక శాతం ఏపీలో చేసినవే. రాష్ట్రాల వారీగా పరీక్షల, బాధితుల నిష్పత్తి చూసుకుంటే కూడా ఏపీలో తక్కువ; చేస్తున్న ప్రతీ వంద పరీక్షల్లో బాధితుల సంఖ్యలో తగ్గుదల చూపిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందన్నది వాస్తవం. ఇలాంటివన్నీ అధికారిక సమాచారమే అయినా ఆర్కే ‘పలుకు’ల్లో పొరబాటున కూడా ఈ వివరాలు కానరావు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రతీ నియోజకవర్గంలో వందల సంఖ్యలో క్వారెంటైన్ బెడ్లు ఏర్పాటు చేయడం నుంచి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చైనా నుంచి టెస్టింగ్ కిట్లు కొంటున్న సమయంలో కొరియా నుంచి కొనడం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎక్కడా తప్పు పట్టాల్సిన పనే లేకపోయినా ఏనాడూ ఆర్కే ప్రభుత్వాన్ని అభినందించిన దాఖలాలే లేవు.

కరోనా వ్యాప్తికి కారణం కేవలం ఒక మతమే అన్నట్టు సామాజిక మాధ్యమాల నుంచి ఒక వర్గం మీడియా వరకు ఎందరో విద్వేషభరితమైన వ్యాక్యాలు చేస్తూన్నప్పుడు దేశంలోని ముఖ్యమంత్రులందరి కన్నా ముందుగా “ఈ వ్యాధిని కేవలం ఒక మతానికి అంటగట్టడం సరైనది కాదు” అని చెప్పిన జగన్ జనం దృష్టిలో మరో మెట్టు పైకి ఎదిగాడు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రాధమిక లక్షణాల ఆధారంగా కరోనా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం ఒక్కటే ప్రభుత్వాలు చేయగలిగింది. వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరూ మసలుకోవాలి అని జగన్ చెప్పిన మాట అక్షరాలా నిజం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ చెప్పారు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు. వైఎస్ జగన్ మీద రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసిన ‘లోక్ సత్తా’ పార్టీ అధ్యక్షుడు, స్వయాన వైద్యుడు అయిన జయప్రకాశ్ నారాయణ; జగన్ మీద ఆరోపించబడ్డ కేసుల విచారణలో కీలక పాత్ర పోషించిన సీబీఐ మాజీ జెడి, మాజీ జనసేన పార్టీ నేత లక్ష్మీ నారాయణలు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఇదే విషయాన్ని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దాదాపు అందరి కంటే ముందుగా వైఎస్ జగన్ చెప్పిన ఈ వాస్తవాన్ని ఇప్పుడు అందరూ చెబుతున్నా కూడా ఆ విషయాలు ప్రస్తావించకపోగా – కరోనా వ్యాధి పట్ల నిర్లక్ష్య ధోరణిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడో అన్న మాటలతో జగన్ మాటలను పోల్చడం భావదారిద్య్రం కాక మరేమిటని ‘అంతర్జాతీయ సమాజం’ ఆశ్చర్యపోతోంది.

ఏది ఏమైనా – ‘చంద్రబాబును ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పొగడకుండా ఆర్కే కలం నుంచి అర పేజీ వ్యాసం వచ్చింది. ఇది చూస్తుంటే బాబును ఇంతకాలం తన రాతలతో వాస్తవ పరిస్థితులకు దూరం చేసిన ఆర్కే, ఇప్పుడు నడిసముద్రంలో బాబును వదిలేసి ఆర్కే కూడా దూరం జరగబోతున్నాడా ?’ అని ‘ఐ డ్రీమ్ పోస్ట్’ కార్యాలయం సెక్యూరిటీగార్డు స్నేహితుడు షోలాపూర్ నుంచి ఫోన్ చేసి అనుమానం వ్యక్తపరిచాడట.

ఎన్ని అర్థరహితరాతలు రాసినా జగన్ చెప్పిన అభిప్రాయమే దేశంలో చాలా మంది నేతలు వెలిబుచ్చుతున్నారంటే జగన్ మాటలకు కోరస్ పాడుతున్నది ఎవరో విజ్ఞులైన ప్రజలు బాగా అర్ధం చేసుకోగలరు. ఆర్కే లాంటి వారు రాగాన్ని చెడగొట్టడానికి ఎన్ని అపశ్రుతులు పాడినా పెద్ద ఉపయోగం ఉండదని తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నిజమైన కోరస్ జనగళం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి