iDreamPost

దేశ వ్యాప్తంగా 75 జిల్లాలు లాక్‌ డౌన్‌.. ఏపీలోనూ మూడు జిల్లాలు.. అనధికారికంగా దేశం లాక్‌డౌన్‌..

దేశ వ్యాప్తంగా 75 జిల్లాలు లాక్‌ డౌన్‌.. ఏపీలోనూ మూడు జిల్లాలు.. అనధికారికంగా దేశం లాక్‌డౌన్‌..

కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న జిల్లాలను లాక్‌ డౌన్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 75 జిల్లాలను లాక్‌ డౌన్‌ చేశారు. ఈ జాబితాలో ఏపీలోని మూడు జిల్లాలు ఉండడం కలవరానికి గురిచేస్తోంది. ఏపీలో కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాలు లాక్‌ డౌన్‌ జాబితాలో ఉన్నాయి.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు గుర్తించక ముందు ప్రజల మధ్య సంచరించిన జిల్లాలకే లాక్‌ డౌన్‌ను పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఓ వ్యక్తికి కరోనా రాగా… అతను బయట ప్రాంతాల్లో తిరిగారు. అదే విధంగా కృష్ణా జిల్లా విజయవాడ ఒన్‌ టౌన్‌లో కూడా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి మూడు రోజులుగా పరిసరాల్లో సంచరిచారు. విశాఖలోనూ విజయవాడ, ప్రకాశంలోని పరిస్థితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆ మూడు జిల్లాలను లాక్‌డౌన్‌ చేసినట్లు సమాచారం.

ఏపీలో మొదటి కేసు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో నమోదైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. చికిత్స అనంతరం ఆ యువకుడు కోలుకున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాను లాక్‌ డౌన్‌ చేయలేదని తెలుస్తోంది.

ఏపీలో మూడు జిల్లాలు లాక్‌ డౌన్‌ చేసినట్లు అధికారికంగా ప్రకటించినా.. అనధికారికంగా అన్ని జిల్లాలు లాక్‌ డౌన్‌ అయినట్లే. లాక్‌డౌన్‌ చేసిన జిల్లాల మీదుగా ఇతర జిల్లాల నుంచి వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఎక్కడికక్కడ జిల్లా సరిహద్దులు మూసేస్తారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాసులు విశాఖకు రాలేదు. కృష్ణా జిల్లాను లాక్‌ డౌన్‌ చేయడంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు అటు విశాఖకు, ఇటు కృష్ణా జిల్లాకు రాలేదు. ప్రకాశం జిల్లా లాక్‌ డౌన్‌ వల్ల నెల్లూరు, సీమ ప్రజలు ఆ జిల్లాను దాటి అమరావతికి వెళ్లే అవకాశం లేదు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండేందుకే ప్రారంభంలో ఇలా మూడు జిల్లాలను లాక్‌ డౌన్‌ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి