iDreamPost

ఫార్టీ ఇయర్స్‌ పార్టీకి ఉనికిపాట్లు – నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్న టీడీపీ

ఫార్టీ ఇయర్స్‌ పార్టీకి ఉనికిపాట్లు – నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకోనున్న టీడీపీ

తెలుగునాట ఒక ప్రభంజనంలా ప్రభవించిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఉత్తాన పతనాలు చూసింది.ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ముక్కుతూ మూలుగుతూ అన్నట్టుగా ఉనికిపాట్లు పడుతోంది. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. పేదలకు పట్టెడన్నం పెట్టడమే ధ్యేయం. మహిళల కన్నీళ్లను తుడవాలంటే మద్యపానం దురలవాటును సమాజం నుంచి పారదోలాలి వంటి ఆశయాలతో ప్రముఖ చలనచిత్ర నటుడు నందమూరి తారక రామారావు టీడీపీని 1982 మార్చి 29న ప్రారంభించారు.

తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భావం..

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. అయితే అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా తరచుగా ముఖ్యమంత్రులను మార్చేవారు. వారు ఢిల్లీ దర్బారు కనుసన్నల్లో పనిచేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. చైతన్యరథంపై రాష్ట్రమంతా కలియదిరిగారు. ఊరూవాడా బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా 294 స్థానాలకు 202 గెలిచి 1983 జనవరి 9న ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ఎన్నో రికార్డులు.. సంచలనాలు

ఎన్టీఆర్‌ హయాంలో పార్టీ ఎన్నో రికార్డులకు, సంచలనాలకు కేంద్రంగా ఉండేది. ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా లోక్‌సభలో గుర్తింపుపొందిన ఘనత టీడీపీదే. ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి రావడం ఒక రికార్డు. కాంగ్రెస్‌ కుట్రతో పదవిని కోల్పోయినా నెల తిరగకుండానే మళ్లీ సీఎంగా పదవిని చేపట్టడం సంచలనం. ఎన్టీఆర్‌ హయాంలో మూడుసార్లు టీడీపీ 200కు పైబడి సీట్లు గెలవడం ఒక రికార్డు. కాంగ్రెసేతర పక్షాలను ఏకంచేసి నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరించిన ఎన్టీఆర్‌ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన పిలుపు మేరకు 1989లో 106 మంది ఎంపీలు రాజీనామా చేయడం అప్పట్లో ఒక సంచలనం.

పార్టీని కుదిపేసిన రెండు వెన్నుపోట్లు

1984 ఆగష్టులో నాటి ఆర్థికమంత్రి నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడవడంతో ఎన్టీఆర్‌ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్‌ నుంచి వలసవచ్చిన నాదెండ్ల కేంద్రంలో అధికారం ఉన్న ఆ పార్టీ సహకారం తీసుకొని మెజార్టీ లేకపోయినా సీఎంగా గద్దెనెక్కారు. అయితే ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీత్యుచుడిని చేయడాన్ని జీర్ణించుకోలేని ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో నెల్లాళ్లు తిరక్కుండానే నాదెండ్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. తిరిగి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. మెజార్టీ ఉన్నప్పటికీ  మళ్లీ ప్రజాతీర్పు కోరాలని భావించి తన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు ఎన్టీఆర్‌ సిఫార్స్‌ చేశారు.

1985 మార్చిలో అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ప్రధాని ఇందిరాగాంధీ మరణంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సానుభూతి పవనాలు వీచినా ఆంధ్రాలో టీడీపీ ఘనవిజయం సాధించి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 1994లో తిరిగి ఎన్టీఆర్‌ నాయకత్వంలో అధికారం చేపట్టింది. అయితే ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి వల్ల పార్టీలో తనకు భవిష్యత్తు ఉండదని భయపడ్డ ఆయన అల్లుడు చంద్రబాబు వెన్నుపోటుతో 1995 ఆగష్టులో ఎన్టీఆర్‌ను గద్దె దింపారు. తాను స్థాపించిన పార్టీని, సంపాదించిన పదవిని సొంత అల్లుడు కుట్రతో స్వాధీనం చేసుకోవడాన్ని ఎన్టీఆర్‌ జీర్ణించుకోలేకపోయారు. కుటుంబసభ్యులను కూడా తనకు దూరం చేయడంతో తీవ్ర మనోవ్యథకు గురైన ఆయన 1996 జనవరి 18న గుండెపోటుతో మృతిచెందారు.

ప్రజలకు దూరంగా.. కార్పొరేట్‌ కు దగ్గరగా..

టీడీపీని, ముఖ్యమంత్రి పదవిని కబ్జా చేసిన చంద్రబాబునాయుడు పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు దూరం జరిగారు. ఎన్టీఆర్‌ ప్రారంభించిన కిలో రెండ్రూపాయల బియ్యం పథకానికి తూట్లు పొడిచి దాని ధరను రూ.5.25 చేశారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. సీఎంగా కాకుండా రాష్ట్రానికి సీఈఓగా ఉండేవారు. జనం కూడా అలాగే పిలవాలని ఆశించేవారు. విద్యను, వైద్యాన్ని కార్పొరేటీకరణ చేశారు. ఉద్యోగ నియామకాలు గాలికొదిలేశారు. చేసేది గోరంత.. ప్రచారం కొండంత అన్నట్టుగా వ్యవహరించారు. ఒకప్పుడు బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఉండేది. ఎస్సీ, ఎస్టీలకు గౌరవం దక్కేది. బాబు హయాంలో ఆ వర్గాలు క్రమంగా పార్టీకి దూరం అయ్యాయి.

మీడియా బేస్డ్‌ పార్టీగా..

ఎన్టీఆర్‌ హయాంలో క్యాడర్‌ బేస్డ్‌ పార్టీగా పేరు పొందిన టీడీపీ.. బాబు హయాంలో మీడియా బేస్డ్‌గా మారిపోయింది. ఎన్టీఆర్‌లా ఓట్లు సంపాదించే సామర్థ్యం తనకు లేదని గుర్తించిన చంద్రబాబు.. ఇప్పటికి ఎన్టీఆర్‌ బొమ్మను అడ్డుపెట్టుకుని, ఆయన కుటుంబాన్ని ఆసరా చేసుకొని ఎన్నికల్లో గెలవాలని చూస్తుంటారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గట్టెక్కే పద్దతిని ఆశ్రయిస్తున్నారు. ఆయన హయాంలో మొట్టమొదటి సారి 2019 ఎన్నికల్లోనే టీడీపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓడిపోయింది. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేవలం 23 సీట్లకు పరిమితం అయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జనంలో చంద్రబాబుకు విశ్వసనీయత లేకుండా పోయింది. ఆయన కూడా ఓటు వేసే జనం, వేయించే నాయకులు, కార్యకర్తలపై కాకుండా తాను వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి కావడానికి సాయపడ్డ మీడియాపైనే ఇప్పటికీ ఆధారపడుతున్నారు.

రాష్ట్ర స్థాయి జాతీయ నాయకుడిగా..

ప్రస్తుతం చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆ పార్టీకి మరే రాష్ట్రంలోనూ బలం, బలగం లేదు. ఎమ్మెల్యేలతో సహా నాయకులందరూ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. 23 మంది ఎమ్మెల్యేల్లో ఎందరు తమ పార్టీలో ఉన్నారో స్పష్టంగా చెప్పలేని స్థితిలో టీడీపీ నాయకత్వం ఉంది. 2019 తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌, ఉప ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. క్యాడర్‌ చేజారిపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. అందుకే వయసు మీద పడినా, లేని ఓపిక తెచ్చుకొని చంద్రబాబు తెలుగుదేశంకు వెలుగు తేవాలని కష్టపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి