iDreamPost

జలియన్ వాలా భాగ్ దమనకాండకు 101 ఏళ్ళు

జలియన్ వాలా భాగ్ దమనకాండకు 101 ఏళ్ళు

కొన్ని సంఘటనలు జరిగి వందల సంవత్సరాలైనా వాటి నేపథ్యం గుర్తుకు రాగానే దేశభక్తిని రగిలిస్తూనే ఉంటాయి. భారత స్వాతంత్ర పోరాటంలో నాటి అమానుష ఘటన జ్ఞాపకాల పొరలను తట్టగానే భారతీయుల రోమాలు నిక్కబొడుచుకొంటాయి.ఆ విషాదకర దుర్ఘటనకు కారణమైన ఆంగ్లేయ పాలకులను సిగ్గుతో నాగరిక సమాజం ముందు తలవంచుకొనేలా చేసింది.అలాంటి సంఘటనే 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలాభాగ్ దమనఖాండ. నిస్సహాయ స్థితిలో ఉన్న భారతీయులను బ్రిటిష్ వారు ఊచకోత కోసిన ఘటనకు ఈరోజుతో 101 సంవత్సరాలు పూర్తయ్యాయి.

1919 నాటికి భారతదేశంలో స్వాతంత్ర కాంక్షతో పంజాబ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలలో బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు పెల్లుబికాయి. పత్రికల స్వేచ్ఛను హరించి వేసి భారత స్వాతంత్ర పోరాటంలో అగ్నిజ్వాలల వలె ఉవ్వెత్తున ఎగసిపడే యువకులను,ఉద్యమకారులను నిర్బంధించుటకు 1919 జనవరిలో బ్రిటిష్ వారు రౌలాత్ చట్టాలు చేశారు.

సోహన్ సింగ్ బక్నా అన్నట్లు “మనం సిక్కులం కాదు, పంజాబీయులం కాదు. మన మతం దేశభక్తి.” అని రగిలిపోయిన అమృతసర్ ప్రజలకు సత్యపాల్,సైఫుద్దీన్ కిచ్లు లు నాయకత్వం వహించారు. వారిద్దరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి దేశ భహిష్కరణ శిక్ష వేసింది. ఇంకా అమృతసర్‌లో మార్షల్‌ లా విధించారు.

ఆంగ్లేయ పాలకుల నిర్బంధానికి నిరసనగా జలియన్ వాలాబాగ్‌లో వేలాదిమంది సమావేశం అయ్యారు.పైగా ఆరోజు పంజాబీ ప్రజల నూతన సంవత్సర పండుగ “వైషాఖి” కావటంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. బ్రిగేడియర్ డయ్యర్ నాయకత్వంలో బ్రిటిష్ సైనికులు జరిపిన కాల్పులలో అధికారికంగా 379 మంది చనిపోయినట్లు ప్రకటించారు.

కానీ వాస్తవంగా నాటి జలియన్ వాలాబాగ్ దమనకాండలో కొన్ని వేలమంది ప్రజలు చనిపోయారు. ఆ పార్కుకు ఒకే గేటు ఉండడం, బ్రిటిష్ సైనికులు తమ తుపాకులలోని తూటాలన్నీ అయిపోయేదాకా కాల్పులు జరపటం అత్యధిక మరణాలకు కారణం. జలియన్ వాలాబాగ్ దుశ్చర్య పట్ల నిరసన ప్రకటిస్తూ విశ్వకవి రవీంద్రనాద ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన తన “నైట్ హుడ్” బిరుదును త్యజించాడు.

భారత స్వాతంత్ర పోరాటానికి నెత్తుటి మరకలు అంటిన ఘటన జరిగిన 21 సంవత్సరాలకు అంటే స్వాతంత్రం రావటానికి 7 సంవత్సరాల ముందు 1940 మార్చి 13 న జనరల్ డయ్యర్‌ను ఉద్దాంసింగ్ అనే దేశభక్తుడు ఇంగ్లాండ్‌లో కాల్చి చంపాడు. ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఇంగ్లాండ్ వరకు వెళ్లి రెక్కీ నిర్వహించి డయ్యర్‌ని చంపడం నాటి భారతీయ యువకుల దేశభక్తికి ఒక ఉదాహరణ మాత్రమే. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత ఆదిత్య ముఖర్జీ పేర్కొన్నట్లు “The Mahatma’s Indian Experiment Begun.”

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి