iDreamPost

అనుకోని ప్రయాణం రిపోర్ట్

అనుకోని ప్రయాణం రిపోర్ట్

దీపావళికి వచ్చిన సినిమాల సందడి ముగింపుకు వచ్చేయడంతో నిన్న విడుదలైన అనుకోని ప్రయాణం మీద ప్రేక్షకులకు మంచి అంచనాలున్నాయి. కామెడీతోనే కాదు ఎమోషన్ తోనూ అద్భుతంగా మెప్పించగలరనే పేరున్న రాజేంద్ర ప్రసాద్, జగన్మోహిని లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒకప్పుడు జానపద హీరోలకు పోటీ ఇచ్చిన నరసింహరాజు కాంబినేషన్ లో వెంకటేష్ పెదిరెడ్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ జగన్ మోహన్ నిర్మించడంతో పాటు కథను కూడా అందించారు. అగ్ర రచయితలు పరుచూరి బ్రదర్స్ చాలా కాలం తర్వాత ఒక చిన్న చిత్రానికి రచన చేయడం విశేషం. పోటీ లేకుండా మంచి వాతావరణంలో రిలీజైన ఈ ప్రయాణం ఎలా సాగిందో రిపోర్ట్ లో చూద్దాం.

ఎక్కడో భువనేశ్వర్ లో ఉన్న ఓ భవన నిర్మాణంలో పనిచేసే ఇద్దరు మిత్రుల మధ్య కథ ఇది. రాజేంద్ర(రాజేంద్ర)కు సెంటిమెంట్లు తక్కువ. దానికి భిన్నంగా ఉండే మనస్తత్వం రాము(నరసింహరాజు)ది. హఠాత్తుగా కరోనా వచ్చి పనులన్నీ ఆగిపోవడంతో ఇద్దరూ కలిసి ఊరికి వెళదామని నిర్ణయించుకుంటారు. ఊహించని విధంగా రాము కన్ను మూయడంతో అతన్ని మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చే బాధ్యతనను రాజేంద్ర తీసుకుంటాడు. కానీ అడుగడుగునా అడ్డంకులు ఆంక్షలు కఠిన పరీక్ష పెడతాయి. ప్రాణం మీదకు వచ్చే పరిస్థితులు వచ్చినా లెక్క చేయకుండా భుజం మీద వేసుకుని ప్రయాణం కొనసాగిస్తాడు. వీటిని దాటుకుని చివరికి గమ్యం ఎలా చేరుకున్నాడనేదే అసలు స్టోరీ.

మానవ సంబంధాలను కరోనా లాంటి జబ్బులు ఎంత తీవ్రంగా ప్రభావితం చేశాయో ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా చూశారు. అయినవాళ్ల చివరి చూపు దక్కని వాళ్ళ మనోవేదన వర్ణణాతీతం. ఈ పాయింట్ నే తీసుకున్న వెంకటేష్ పెదిరెడ్ల చాలా హృద్యంగా భావోద్వేగాలను తెరకెక్కించారు. కథనం మధ్యలో కొంత నెమ్మదిగా వెళ్లినట్టు అనిపించినా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో విజయం సాధించారు. సంభాషణలు, రాజేంద్ర జర్నీలోని సంఘటనలు అన్నీ ఆసక్తికరంగా సాగాయి. సీనియర్ క్యాస్టింగ్ చాలా ఉపయోగపడింది. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా నటకిరీటి ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి సరసన ఈ అనుకోని ప్రయాణాన్ని నిలబెట్టింది. జీవితాన్ని తెరమీద చూసిన అనుభూతినిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి