iDreamPost

చంద్రబాబు డైవర్షన్‌కు ఎస్పీ చెక్‌..!

చంద్రబాబు డైవర్షన్‌కు ఎస్పీ చెక్‌..!

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ రోజు చెన్నైలో ఆయనను కడప పోలీసులు అరెస్ట్‌ చేసి జిల్లాకు తీసుకువచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పులివెందుల పూలఅంగళ్ల సెంటర్‌లో అల్లర్లు, ఘరణ నేపథ్యంలో నమోదైన కేసులో బీటెక్‌ రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ రోజు ఇరు పక్షాలకు చెందిన 253 మందిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతల రాళ్ల దాడిలో ఎస్‌ఐ గాయపడ్డారు. బీటెక్‌ రవితో సహా 63 మందిపై హత్యాహత్నం కింద కేసు నమోదైంది. అందుకు సంబంధించిన వారెంట్‌ పెండింగ్ లో ఉంది. ఈ ఘటనపై తాజాగా పులివెందుల పోలీసులు బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేశారు.

అయితే రవిని ఎందుకు అరెస్ట్‌ చేశారన్న విషయం పోలీసులు వెల్లడించక ముందే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆయన తనయుడు నారా లోకేష్‌లు లైన్‌లోకి వచ్చారు. అరెస్ట్‌ను ఖండిస్తూ.. ఇందుకు గల కారణం ఏమిటో వారే ప్రకటించారు. గత నెల 19వ తేదీన బీటెక్‌ రవి ఛలో పులివెందల కార్యక్రమం నిర్వహించారు. అందుకే పోలీసుల రవిని అరెస్ట్‌ చేశారంటూ ధ్వజమెత్తారు. అరెస్ట్‌ను ఖండిస్తున్నామని, ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ చంద్రబాబు, లోకేష్‌లు ఒకే బాణిలో ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు.

అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ.. టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ముందుకు వచ్చారు. బీటెక్‌ రవి అరెస్ట్‌కు గల కారణాలను వెల్లడించారు. 2018లో పులివెందుల పూలఅంగళ్ల సెంటర్‌ ఘటన. నమోదైన కేసుల వివరాలు వెల్లడించి.. తెలుగుదేశం పార్టీ చేస్తున్న డైవర్షన్‌కు చెక్‌ పెట్టారు. అయితే ఈ లోపు తెలుగుదేశం అనుకూల మీడియా బీటెక్‌ రవి అరెస్ట్, అందుకు టీడీపీ నేతలు చెప్పిన కారణాలను విస్తృతంగా ప్రచారం చేయడం గమనార్హం. అసలు ఎందుకు అరెస్ట్‌ చేశారోనన్న విషయం తెలుసుకోకుండానే.. విషయాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి