iDreamPost

యస్‌ బ్యాంక్‌ సంక్షోభం-టీటీడీ బయటపడింది.. ఆంధ్రా ఆర్టీసీ ఇరుక్కుంది ..

యస్‌ బ్యాంక్‌ సంక్షోభం-టీటీడీ బయటపడింది.. ఆంధ్రా ఆర్టీసీ ఇరుక్కుంది ..

గత నాలుగు రోజులుగా ఆర్థిక సెక్టార్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది. అదే యస్‌ బ్యాంక్‌ సంక్షోభం. ఆర్థిక క్రమ శిక్షణ పాటించకపోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేయడంతోపాటు నెల రోజుల పాటు మారటోరియం కూడా విధించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ కస్టమర్లపై తీవ్ర ప్రభావం పడింది. విత్‌డ్రాకు కూడా ఆంక్షలు విధించడంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఖాతాదారుల సొమ్ముకు కేంద్ర ఆర్థిక మంత్రి హామీ ఇవ్వడంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది.

అయితే ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థగా(పీటీడీ) మారిన ఆర్టీసీపై కూడా యస్‌ బ్యాంక్‌ ఎఫెక్ట్‌ పడినట్లు తెలుస్తోంది. యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ రాణా కపూర్‌తో ఉన్న సంబంధాల కారణంగా చంద్రబాబు 2015 నుంచి సంస్థ ఆర్థిక లావాదేవీలను విజయవాడలోని యస్‌ బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి నిర్వహించేలా చేశారు. జాతీయ ప్రభుత్వ బ్యాంకులను కాదని ఒక ప్రైవేటు బ్యాంకులో అతిపెద్ద కార్పొరేషన్‌ అయిన ఆర్టీసీ నిధులను ఉంచడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఆర్టీసీ ఉద్యోగుల జవవరి జీతాలకు సంబంధించి దాదాపు రూ. 120 కోట్లను యస్‌ బ్యాంక్‌లో జమ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ వచ్చే కలెక్షన్లు డబ్బులు దాదాపు రూ. 80 కోట్లు, సంస్థ ఉద్యోగుల పీఎఫ్‌ డబ్బులు రూ. 40 కోట్లు.. వెరసి మొత్తం 240 కోట్లు యస్‌ బ్యాంకులో ఉన్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.

దేశ వ్యాప్తంగా విత్‌డ్రాలపై ఉన్న ఆంక్షలు ఆర్టీసీకి కూడా వర్తించడంతో రోజుకు కేవలం రూ. 50వేలు మాత్రమే తీసుకునేందుకు వీలుండడంతో యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. అయితే యస్‌ బ్యాంక్‌లో ఆర్టీసీ లావాదేవీలకు కారణమైన చంద్రబాబు పేరును మాత్రం ప్రస్తావించకుండా.. ఇప్పటి ప్రభుత్వం వడ్డీలకు ఆశపడి యస్‌ బ్యాంక్‌లో నిధులు పెట్టినట్లు కథనాన్ని అల్లేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే యస్‌ బ్యాంక్‌లో కరెంట్‌ అకౌంట్‌ను ప్రారంభించిన విషయాన్ని దాచిపెట్టింది. అయితే ఒక పత్రిక దాచినంత మాత్రాన వాస్తవాలు దాగవు కదా.. ఇలా బయటకొస్తుంటాయి.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన దాదాపు 1300 కోట్ల డిపాజిట్లను చంద్రబాబు హయాంలో యస్‌ బ్యాంక్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే యస్‌ బ్యాంకులోని లుకలుకలు పసిగట్టిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముందస్తుగా యస్‌ బ్యాంకులోని డిపాజిట్లను ఉపసంహరింపజేయడంతో దేవస్థానం నిధులు సేఫ్‌ అయ్యాయి.

ఈ యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో టీటీడీ బయటపడితే.. పీటీడీ ఇరుక్కుపోయిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక నెలరోజుల్లో పరిస్థితి సద్దుమనుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి