iDreamPost

దువ్వాడ హ‌త్య‌కు అచ్చెన్నాయుడు కుట్ర.. విచార‌ణ‌కు ఎమ్మెల్సీ డిమాండ్‌

దువ్వాడ హ‌త్య‌కు అచ్చెన్నాయుడు కుట్ర.. విచార‌ణ‌కు ఎమ్మెల్సీ డిమాండ్‌

ఏపీ రాజ‌కీయాలు ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. టీడీపీ అధినాయ‌కుడు చంద్ర‌బాబు ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని పొలిట్ బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య డీజీపీకి లేఖ రాస్తే.. న‌న్ను చంపేందుకు అచ్చెన్నాయుడు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని అచ్చెన్న ఏడాదిగా హ‌త్య‌కు కుట్ర చేస్తున్నారన్నారు. అందుకు టీడీపీ కార్య‌క‌ర్త వెంకటరావును అచ్చెన్నాయుడు పావుగా చేసుకున్నారని చెప్పారు. అనంత‌రం వెంకటరావును ఆపార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడే హత్య చేయించి, ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని దువ్వాడ మండిపడ్డారు. వెంకటరావు మరణం ధ్రువీకరణ కాక ముందే.. అతని కుటుంబసభ్యులను ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు.

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

త‌న హ‌త్య‌కు పావుగా వాడుకుంటున్నార‌న్న విష‌యాన్ని వెంకటరావును బహిర్గతం చేయడంతో కుట్ర బట్టబయలు అవుతుందని ఆందోళన చెందిన అచ్చెన్నాయుడు ఆయన్ని హత్య చేయించారని దువ్వాడ శ్రీ‌నివాస్ ఆరోపించారు. కింజరాపు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు సొంత పంచాయతీ నిమ్మాడలో సర్పంచిగా ఎవరు పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వారిని కింజరాపు సోదరులు హత్య చేయిస్తారని ఆరోపించారు. ఇప్పటికే నిమ్మాడలో ఏడుగురిని హత్య చేయించిన రక్తచరిత్ర అచ్చెన్నాయుడు కుటుంబానికి ఉందన్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన కింజరాపు అప్పన్నకు తాను మద్దతుగా నిలిచి.. నామినేషన్‌ వేయించానని చెప్పారు.

పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ కార్యకర్త వెంకటరావు మూడ్రోజుల క్రితం కింజరాపు అప్పన్నకు ఫోన్‌ చేసి.. ‘‘అచ్చెన్నాయుడుకు నువ్వు సమీప బంధువు అవుతావు. అలాంటిది దువ్వాడను నమ్మి అచ్చెన్నాయుడుకు పోటీగా ఎలా నిలబడతావ్‌. దువ్వాడను ఏడాదిలోగా చంపేస్తాం. అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారని చెప్పారు (ఇందుకు సంబంధించిన ఆడియోను కూడా ఆయ‌న వినిపించారు). దీనిపై ఆందోళన చెందిన అప్పన్న టెక్కలి పోలీసు స్టేషన్‌లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో భాగంగా టెక్కలి పోలీసులు.. మందస పోలీసులతో కలిసి పొత్తంగి గ్రామంలోని వెంకటరావు ఇంటికి వెళ్లారని.. ఆ సమయంలో అతను ఇంట్లో లేరని.. వస్తే టెక్కలి పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పాలని ఆయన భార్యకు పోలీసులు చెప్పి వచ్చారని శ్రీకాకుళం ఎస్పీ సాయంత్రం ప్రకటించారని వివరించారు. వెంకటరావును పోలీసులు బెదిరించిన దాఖలాలే లేవన్నారు.

వెంకటరావు ఎవరో తెలియదు..

పొత్తంగి గ్రామానికి చెందిన వెంకటరావు ఎవరో తనకు తెలియదని దువ్వాడ శ్రీనివాస్‌ చెప్పారు. రెండు దశాబ్దాలుగా కింజరాపు కుటుంబ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. తనపై 19 కేసులు పెట్టించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు… అందిస్తున్న సుపరిపాలన వల్ల టెక్కలిలో నేను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే తన ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు భయపడుతున్నారు. అందుకే ఏడాదిగా నన్ను చంపడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అందుకు వెంకటరావును పావుగా వాడుకున్నాడు. కింజరాపు అప్పన్నను బెదిరించే క్రమంలో వెంకటరావు మాట్లాడిన మాటల ద్వారా నన్ను హత్య చేయడానికి అచ్చెన్నాయుడు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఆ కుట్రకు ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటరావును అచ్చెన్నాయుడే హత్య చేయించి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని నాపై వేస్తున్నారు’ అంటూ దువ్వాడ శ్రీనివాస్‌ ఆరోపించారు.

విచార‌ణ‌తో వాస్త‌వాలు వెలుగులోకి..

వెంకటరావును హత్య చేయించింది అచ్చెన్నాయుడేనని.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీని దువ్వాడ శ్రీనివాస్‌ కోరారు. దర్యాప్తులో అచ్చెన్నాయుడు కుట్ర బట్టబయలు కావడం ఖాయమన్నారు. హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేసే అచ్చెన్నాయుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి