iDreamPost

ఐటీ దాడులపై.. ఏం చెప్పారు యనమల..?!

ఐటీ దాడులపై.. ఏం చెప్పారు యనమల..?!

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌) శ్రీనివాస్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్, టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి, మాజీ మంత్రి నారా లోకేష్‌ సన్నిహితులైన కిలారి రాజేష్, నరేష్‌ చౌదరిలపై ఈనెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఐటీ శాఖ దాడులు చేసింది. ఈ అంశంపై నిన్న గురువారం రాత్రి ఐటీ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి భాగోతంపై పక్కా ఆధారాలు లభించినట్లు ఐటీ శాఖ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఈ ప్రకటనలో.. ఈ సోదాలు ప్రముఖ వ్యక్తికి చెందిన సన్నిహితులపైన జరిపామని, అందులో సదరు ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి కూడా ఉన్నారంటూ.. ఐటీ శాఖ తెలిపింది.

ఇంత పక్కాగా ఐటీ శాఖ ప్రకటన చేయగా.. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి అసలు సదరు ఐటీ దాడులతో తమ పార్టీకి ఏమిటి సంబంధం అంటూ తాజాగా మీడీయా సమావేశంలో ప్రశ్నించారు. తమ పార్టీపై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. యనమల మాటలు విన్న మీడియా ప్రతినిధులు, టీవీల్లో చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాజకీయ విశ్లేషకులు విస్తుబోయారు. యనమల వ్యాఖ్యలతో.. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డికి, మాజీ మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు కుమారుడు శరత్‌కి టీడీపీతో సంబంధం ఉందా..? లేదా..?, నారా లోకేష్‌కు కిలారి రాజేష్, నరేష్‌ చౌదరి సన్నిహితులా కారా..? అనేది తెలుసుకునేందుకు రాజకీయ పరిశీలకులు తలమునకలై ఉన్నారు.

బోగస్‌ సబ్‌ క్రాంట్రాక్టర్ల ద్వారా రెండు కోట్ల లోపు లావాదేవీలు జరిపి.. ఆ మొత్తాన్ని విదేశాలకు పంపి.. అక్కడ నుంచి మళ్లీ వీదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి తెచ్చారనీ ఐటీ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన అధారాలను ఐటీ శాఖ గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ తతంగం అంతా ఓ ప్రభుత్వ ఉద్యోగి చేయగలడా..? అంటే ఖచ్చితంగా కాదనే ఎవరైనా చెబుతారు. ఐటీ శాఖ స్వయంగా ప్రకటన జారీ చేయడం, అందులో ప్రముఖ వ్యక్తి పీఎస్, సన్నిహితులు అంటూ పేర్కొన్నా.. వారితో తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అంటూ తనదైన శైలిలో యనమల ప్రశ్నించడం విశేషం.

పీఏలు, పీఎస్‌లు ఎందరో వస్తుంటారు.. పోతుంటారని, వారితో సంబంధం ఏముందని ముక్తాయించిన యనమల.. అదే సమయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తమ పార్టీపై ఫిర్యాదులు చేయడానికే ఉన్నారంటూ విమర్శించారు. అందుకే జగన్‌ విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారని వింత వాదన వినిపించారు. ఓ పక్క ఐటీ దాడులతో తెలుగుదేశం పార్టీకి ఏమిటి సంబంధం అంటూనే.. మరో పక్క తమ పార్టీపై ఫిర్యాదులు చేస్తున్నారని యనమల చెప్పడం వెనుక ఆంతర్యమేమిటన్నది విశ్లేషకులకు కూడా అందడంలేదు. పైపెచ్చు.. యనమల వైఎస్‌ జగన్‌పై గత పదేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు చేస్తూ త్రీవ స్థాయిలో ధ్వజమెత్తడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి