iDreamPost

మాజీ కాబోతున్న బీద రవిచంద్ర .. టీడీపీలో కలవరం..!

మాజీ కాబోతున్న బీద రవిచంద్ర .. టీడీపీలో కలవరం..!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పేరొందిన వారిలో బీద కుటుంబం ఒకటి. బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర యాదవ్‌ సోదరులు. మస్తాన్‌రావు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తమ్ముడు బీద రవిచంద్ర యాదవ్‌.. టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవీ కాలం రేపు శుక్రవారం (12.06.2021) తో ముగుస్తోంది. శనివారం నాటికి రవిచంద్ర యాదవ్‌ మాజీ కాబోతున్నారు.

దాదాపు ఏడాది నుంచి బీద రవిచంద్ర యాదవ్‌ రాజకీయంగా స్తబ్ధుగా ఉన్నారు. టీడీపీలో ఉన్నా.. ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. గత ఏడాది జరిగిన టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో బీద రవిచంద్ర యాదవ్‌ పేరు ఏపీ అధ్యక్షుడు రేసులో వినిపించింది. బీసీలను మళ్లీ దగ్గరకు చేర్చుకునే లక్ష్యంతో ఏపీ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించడంతో కింజారపు రామ్మోహన్‌ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌ పేర్లు బలంగా వినిపించాయి. అయితే వీరు ఇద్దరు కాకుండా కింజారపు అచ్చెం నాయుడు పేరు తెరపైకి వచ్చింది. బీద రవి టీడీపీ జాతీయ కార్యదర్శి పదవితో సరిపెట్టుకున్నారు.

అప్పటి నుంచి బీద రవిచంద్ర యాదవ్‌ పెద్దగా యాక్టీవ్‌గా ఉండడం లేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. ఇటీవల తిరుపతి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు నెల్లూరు జిల్లా ఉన్నాయి. సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి లోక్‌సభ పరిధిలోనివి. టీడీపీ నేతలు చిత్తూరు జిల్లా కన్నా.. ఈ జిల్లాపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. ఆ సమయంలోనూ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడైన రవి ఎక్కడా కనిపించలేదు. పార్టీ బాధ్యతలు అన్నీ మాజీ మంత్రి సోమిరెడ్డి చేపట్టారు.

2001 పరిషత్‌ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి బీసీకి రిజర్వ్‌ కావడడంతో టీడీపీ తరఫున రాజకీయారంగేట్రం చేసిన రవిచంద్ర యాదవ్‌ టీడీపీ అభ్యర్థి అయ్యారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జిల్లా పరిషత్‌ టీడీపీ ఆధిపత్యంలోనే ఎక్కువగా ఉంది. ఈ సారి కూడా బీద రవిచంద్ర యాదవ్‌ చైర్మన్‌ కావడం తధ్యమనుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 25 జడ్పీటీసీలు, టీడీపీ 21 జడ్పీటీసీలను గెలుచుకున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ కాంగ్రెస్‌ అభ్యర్థులను తనవైపు తిప్పుకునేందుకు యత్నించినా.. నేదరుమల్లి జనార్థన్‌ రెడ్డి క్యాంపు రాజకీయాలు, ఆనం రామనారాయణ రెడ్డి చాణక్యంతో విఫలమయ్యాయి. చైర్మన్‌ ఎన్నిక రోజు కాంగ్రెస్‌ జడ్పీటీసీ ఒకరు టీడీపీ వైపు వెల్లడంతో కాంగ్రెస్‌కు 24, టీడీపీ బలం 22కు పెరిగింది. అయినా మూడు సీట్ల తేడాతో రవిచంద్ర జడ్పీ చైర్మన్‌ అయ్యే అవకాశం కోల్పోయారు.

బీద బ్రదర్స్‌లో మస్తాన్‌ రావు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. టీడీపీ తరఫున 2009లో కావలి నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో ఓటమిపాలయ్యారు. మస్తాన్‌ రావు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో.. రవిచంద్రను 2015లో చంద్రబాబు గవర్నర్‌ కోటాలో పెద్దల సభకు పంపారు. రేపటితో బీద పదవీ కాలం ముగుస్తోంది. మళ్లీ అవకాశం వచ్చే పరిస్థితి టీడీపీలో లేదు. రాష్ట్రంతోపాటు నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ పరిస్థితి తీసికట్టుగా ఉంది. రవి అన్న మస్తాన్‌ రావు వైసీపీలో ఉన్నారు. వీటితోపాటు రవి ఏడాది నుంచి మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ పయనంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు టీడీపీలో కలవరం రేపుతున్నాయి.

Also Read : పోలవరం నుంచి డెల్టా వైపు గోదావరి పరుగులు, ప్రాజెక్టు చరిత్రలో కీలక అధ్యాయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి