iDreamPost

సినిమాను మించిన కథ! తండ్రి త్యాగంతో టీమిండియాలోకి కొడుకు

  • Author Soma Sekhar Published - 01:26 PM, Thu - 6 July 23
  • Author Soma Sekhar Published - 01:26 PM, Thu - 6 July 23
సినిమాను మించిన కథ! తండ్రి త్యాగంతో టీమిండియాలోకి కొడుకు

ఓ తండ్రి తన కొడుకు కెరీర్ కోసం ఏం చేస్తాడు? తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడతాడు. ఇక తన తండ్రి కలను నెరవేర్చడానికి నానా ఇబ్బందులు పడతాడు కొడుకు. ఇక అతడి కలను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. కానీ చివరికి తన కలను నెరవేర్చుకుంటాడు. ఇదేదో సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదు. అవును ఇది సినిమా స్టోరీనే కావొచ్చు.. నిజ జీవిత కథలే సినిమా స్టోరీలుగా తెరకెక్కుతాయి. కానీ ఇప్పుడు చెప్పే కథ సినిమా స్టోరీని మించి ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు. తన కొడుకు కెరీర్ కోసం ఉద్యోగాన్ని వదిలేసిన ఓ తండ్రి, తండ్రి త్యాగాన్ని వృథాకానివ్వకుండా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ తెలుగోడి కథ ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నితీశ్ కుమార్.. విశాఖపట్నానికి చెందిన కుర్రాడు. అందరిలాగే ఐదేళ్ల ప్రాయంలో ప్లాస్టిక్ బ్యాట్ పట్టి సరదాగా క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అయితే అందరిలాగే కొన్నిరోజులు బ్యాట్ పట్టి వదిలేస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ చిన్నతనం నుంచే విశాఖ డివిజన్ క్లబ్ లీగ్స్ లో సీనియర్ల ఆటను చూస్తూ.. వారిలా కావాలని కలలు కనేవాడు. కొడుకు కోరికను నెరవేర్చడం కోసం తండ్రి ముత్యాల రెడ్డి తన ప్రభుత్వం ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. దాంతో అందరు పిచ్చిపని చేశాడు మీ నాన్న అని నితీశ్ కుమార్ తో అన్నారు. కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు. తండ్రి త్యాగాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ.. కోచ్ ల శిక్షణతో నితీశ్ అంచెలంచెలుగా ఎదిగి రంజీ స్థాయికి చేరుకున్నాడు.

కాగా.. బ్యాటింగ్ తో పాటుగా.. బౌలింగ్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగల సమర్థుడు నితీశ్ కుమార్. ఇక నితీశ్ వీడీసీఏ గ్రూప్ ల నుంచి అండర్ 12, 14 జట్లకు జిల్లా స్థాయిలో ఆడటం మెుదలు పెట్టాడు. అయితే నార్త్ జోన్ కు ఆడే టైమ్ లో నితీశ్ ఆటను గుర్తించాడు అప్పటి జాతీయ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్. అతడి ప్రోత్సాహంతో.. కడపలోని ఏసీఏ అకాడమీలో శిక్షణకు అవకాశం లభించింది. ఇది నితీశ్ కుమార్ కెరీర్ ను మలుపు తిప్పిన సంఘటన. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు నితీశ్ కుమార్. అటు బ్యాట్ తో.. ఇటు బంతితో రాణిస్తూ.. విజయ్ మర్చట్ ట్రోఫీలో దుమ్మురేపాడు.

ఈ ట్రోఫీలో ఆంధ్రా తరపున బరిలోకి దిగిన నితీశ్.. నాగాలాండ్ తో మ్యాచ్ లో 345 బంతుల్లోనే ఏకంగా 441 పరుగులు చేశాడు. అలాగే బంతితో రాణించి 26 వికెట్లు తీయడమే కాకుండా.. 176 సగటుతో 1237 పరుగులు చేసి టోర్నీలో రికార్డు నమోదు చేశాడు. దాంతో 2017-18 సీజన్ లో బీసీసీఐ అండర్-16 ఉత్తమ క్రికెటర్ గా జగన్మోహన్ దాల్మియా అవార్డుకు ఎంపిక చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఈ అవార్డు పొందిన తొలి క్రికెటర్ నితీశ్ కావడం విశేషం. కాగా.. 2020లో తొలిసారి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు ఈ తెలుగు తేజం. విజయ్ హాజారే ట్రోఫీలో ఆంధ్రా తరపున 2021లో ఆడాడు. ఇక నితీశ్ కుమార్ ప్రతిభను గమనించిన హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం రూ. 20 లక్షలకు అతడిని 2023 మెగావేలంలో కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ లో రెండే మ్యాచ్ ల్లో అవకాశం దక్కగా.. బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.

ప్రస్తుతం ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యాడు నితీశ్ కుమార్. దాంతో అతడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. భారత-ఏ జట్టు తరపున ఎమర్జింగ్ ఆసియా కప్ కు ఎంపిక కావడం ఆనందంగా ఉందంటూ.. జాతీయ జట్టులో చోటు లక్ష్యంగా మరింత సాధన చేస్తానని నితీశ్ కుమార్ తెలిపాడు. ఇక ఈ విషయం తెలిసిన తెలుగు క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కష్టం ఊరికే పోలేదు అంటూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కఠోర శ్రమతో టీమిండియాలో స్థానం సంపాదించుకున్న నితీశ్ కుమార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి