iDreamPost

విరాట్ వీర విహారానికి 15 ఏళ్ళు పూర్తి! ఆయన్ని ఎవడ్రా ఆపేది?

  • Author Soma Sekhar Published - 05:20 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Published - 05:20 PM, Fri - 18 August 23
విరాట్ వీర విహారానికి 15 ఏళ్ళు పూర్తి! ఆయన్ని ఎవడ్రా ఆపేది?

మైదానమే ఓ యుద్దభూమి అయితే.. దానికి అతడే కింగ్!
ప్రత్యర్థి బౌలర్లు సైనికులు అయితే.. వాళ్లను చీల్చి చెండాడే సేనాధిపతి!
రికార్డులను తన సామంత రాజ్యాలుగా..  పిడికిట్లో బంధించిన యోధుడు అతడు!
అలా క్రికెట్ యుద్ధభూమిలో 15 ఏళ్లుగా స్వైర విహారం చేస్తున్న ఆ యోధుడి పేరే విరాట్ కోహ్లీ..
15 ఏళ్ల క్రితం సాదాసీదాగా క్రికెట్ లోకి అడుగు పెట్టాడు ఓ నూనూగు మీసాల కుర్రాడు. అతడిని చూసి వీడూ అందరిలా వస్తాడు.. ఆడతాడు.. పోతాడు అని అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది వేరు. కట్ చేస్తే.. క్రికెట్ చరిత్రకే తనను బ్రాండ్ అంబాసీడర్ గా చేసుకున్నాడు. రికార్డుల రారాజుగా పేరున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డులనే బద్దలు కొట్టే స్థాయికి ఎదిగాడు. వరల్డ్ క్రికెట్ లో కింగ్ కోహ్లీగా.. టీమిండియా రన్ మెషిన్ గా, ఫిట్ నెస్ గా బాప్ గా పేరేదైనా గానీ పరుగులు సాధించడమే లక్ష్యంగా కెరీర్ కొనసాగిస్తున్నాడు విరాట్ కోహ్లీ. నేటితో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ మెుదలై సరిగ్గా 15 ఏళ్లు కావొస్తోంది. ఈ సందర్భంగా అతడి జీవిత విశేషాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
1988 నవంబర్‌ 5న ఢిల్లీలో జన్మించిన విరాట్‌.. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నాడు. 2006లో ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీ.. 2008లో జరిగిన అండర్‌ 19 వరల్డ్‌ కప్‌తో వెలుగులోకి వచ్చాడు. ఆ ఏడాది వరల్డ్‌ కప్‌ గెలిచిన అండర్‌ 19 జట్టుకు కోహ్లీ కెప్టెన్‌. ఈ ప్రపంచ కప్‌లో కోహ్లీ చేసిన అద్భుత ప్రదర్శన ఆధారంగా కోహ్లీకి జాతీయ జట్టు నుంచి పిలుపొచ్చింది. అయితే అప్పటికే జట్టులో సచిన్‌, సెహ్వాగ్‌, గంభీర్‌, ధోని, యువరాజ్‌ లాంటి హేమాహేమీలు ఉన్నారు. వీరి మధ్య నూనూగు మీసాలతో పిల్లాడిలా ఉండేవాడు కోహ్లీ. టాలెంట్ కు బాడీతో పన్లేదని నిరూపిస్తూ.. 2009 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో శతకం బాది ఔరా అనిపించాడు.
ఇక ఈ సిరీస్ లో వరల్డ్ క్లాస్ బౌలర్ గా పేరుగాంచిన లసిత్ మలింగా బౌలింగ్ ను ఊచకోత కోశాడు కోహ్లీ. దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. లంక సిరీస్ తో టీమిండియా మిడిలార్డర్ కు వెన్నముకగా మారిపోయాడు విరాట్. ఇక 2011లో వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుని, టీమిండియా కప్ గెలవడంతో.. తన వంతు పాత్రను పోషించాడు. ఈ టోర్నీలో 282 పరుగులు చేసిన కోహ్లీ.. ఫైనల్లో గంభీర్ తో కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం కీలకమైనది. ఇక తన అద్భుతమైన ఫామ్ తో టీమిండియా పగ్గాలను ధోని వారసుడిగా అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించాడు. 2016లో తన కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ ను కొనసాగించాడు. ఇటు బ్యాటింగ్ లో అటు కెప్టెన్సీలో తన మార్క్ ను క్రియేట్ చేశాడు.
కాగా.. తన కెరీర్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ.. సచిన్ 100 రికార్డులు బద్దలు కొట్టే మెునగాడు ఎవరంటే? అందరి చూపు.. అందరి వేళ్లు విరాట్ కోహ్లీ వైపే అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక ఛేజ్ మాస్టర్ గా వరల్డ్ క్రికెట్ లో విరాట్ కు బిరుదు ఉన్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే కొంత కాలం క్రితం ఫామ్ కోల్పోయి.. దాదాపు మూడు సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కానీ ఇటీవల తన మునుపటి ఫామ్ ను అందుకుని మరిన్ని రికార్డులు బద్దలు కొడదానికి బయలుదేరాడు ఈ రికార్డుల రారాజు. మరి నేటితో విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్ ప్రారంభించి సరిగ్గా 15 ఏళ్లు అవుతుండటంతో.. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాడు విరాట్. మరి ఈ 15 ఏళ్ల కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు, ఘనతలు, రికార్డులు సాధించిన కింగ్ విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి