iDreamPost

విశాఖ ఉక్కు : ఆక్సిజనే కాదు.. అంతకు మించి..

విశాఖ ఉక్కు : ఆక్సిజనే కాదు.. అంతకు మించి..

తన మనుగడ ప్రమాదంలో పడినా దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా విశాఖ ఉక్కు కర్మాగారం శ్రమిస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణతో దేశం మొత్తం విలవిల్లాడుతోంది. ఒకవైపు మెడికల్ ఆక్సిజన్ కొరత.. మరోవైపు ఆస్పత్రులన్నీ నిండిపోయి కొత్త రోగులకు ప్రవేశం దుర్లభమవుతున్న దయనీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పటికే తన ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి దేశమంతటికీ ప్రాణవాయువు సరఫరా చేస్తోంది. దీనికితోడు ఇప్పుడు మరో కీలక సేవకు సిద్ధమవుతోంది. విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో కోవిడ్ రోగుల కోసం వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది.

ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా..

గత కొన్నాళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ మెడపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో తనకున్న వంద శాతం వాటాను ప్రైవేట్ సంస్థలకు అమ్మేయడం ద్వారా ఉక్కు యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎల్లెడలా ప్రతిఘటన ఎదురవుతున్నా.. కార్మిక సంఘాలు ఆందోళనలు, బందులు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం.. ఇతర రాజకీయ పక్షాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా కేంద్రం స్పందించడంలేదు. ఫలితంగా స్టీల్ ప్లాంట్ మనుగడ, వేలాది సిబ్బంది ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడ్డాయి. ఈ ఒత్తిళ్లను పక్కన పెట్టి.. దేశ శ్రేయస్సు కోసం ప్లాంట్ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి ఒకవైపు ఉక్కు ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తునే.. మరోవైపు కోవిడ్ నియంత్రణకు తమవంతు సహకారం అందిస్తూ మన్ననలు అందుకుంటున్నారు.

కోవిడ్ కేర్ సెంటర్లు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో వెయ్యి పడకల కోవిడ్ చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేసులు పెరుగుతూ రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి నెలకొన్నందున.. తమ ఆధ్వర్యంలో వెయ్యి పడకలు సమకూర్చాలని నిర్ణయించినట్లు ఇటీవల జరిగిన ఉక్కు మంత్రిత్వ శాఖ సమావేశంలో విశాఖ ఉక్కు అధికారులు వెల్లడించారు. ఆ మేరకు కర్మాగారంలోని ఇంజనీరింగ్ షాప్స్ విభాగానికి చెందిన యుటిలిటీ ఎక్విప్మెంట్ రిపేర్ షాపులో పడకల ఏర్పాటు పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉక్కునగరంలోని గురజాడ కళాక్షేత్రంలో 50 సాధారణ, 50 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అవసరాన్ని బట్టి దశలవారీగా కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్లు, ఇతర వేదికలను కూడా కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉక్కు జనరల్ ఆస్పత్రిలోని 110 పడకల వార్డును కోవిడ్ రోగులకు కేటాయించి చికిత్సలు చేస్తున్నారు. వెయ్యి పడకల కేంద్రం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రవాసులకు చాలా ఊరట లభిస్తుంది.

నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా

కాగా దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా చికిత్సకు అత్యవసరమైన ఆక్సిజన్ అందుబాటులో లేకా వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుకొచ్చింది. ఉక్కు ఉత్పత్తిలో కీలకమైన ఆక్సిజన్ కోసం సొంతంగా ఏర్పాటు చేసుకున్న నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి నిరంతరాయంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపుతోంది. అందులో భాగంగా 15 రోజుల క్రితం తీవ్ర కొరత ఎదుర్కొంటున్న మహారాష్ట్రకు రైల్వే సమకూర్చిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ద్వారా ఏడు కంటైనర్లలో మెడికల్ ఆక్సిజన్ పంపింది. గత నెల 13 నుంచి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచు 150 టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు దేశ అవసరాలకు సుమారు 2500 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి