iDreamPost

రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ

రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ

జూన్ 19న జరిగే రాజ్యసభ ఎన్నికలకు సిద్ధపడుతున్న కాంగ్రెస్ పార్టీకి గుజరాత్‌లో ఎదురు దెబ్బ తగిలింది.ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి రెండు రాజ్యసభ సీట్లు గెలవాలనే కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు. కర్జాన్ ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాడా ఎమ్మెల్యే జితూ చౌదరి తమ రాజీనామా పత్రాలను స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి సమర్పించారు. వెంటనే స్పీకర్ వీరి రాజీనామాలను ఆమోదించటం గమనార్హం. ఇంకో ఎమ్మెల్యే కూడా వీరి బాటలోనే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.గత మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీలో బిజెపి పార్టీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉండగా,తాజా రాజీనామాలతో కాంగ్రెస్ బలం 66 కి పడిపోయింది. గుజరాత్‌లో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలలో బిజెపి నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు. బిజెపి అభ్యర్థులుగా అభయ్ భరద్వాజ్, రమీలా బారా, నర్హారీ అమీన్‌లు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరుపున సీనియర్ నాయకులు శక్తిసింహ్ గోహిల్, భరత్‌ సిన్హ్ సోలంకి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వాస్తవానికి అధికార బిజెపి,ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు రాజ్యసభ ఎంపీ సీట్లు ఏకగ్రీవంగా గెలిచే పరిస్థితి ఉంది. కానీ అధికార బిజెపి మూడో అభ్యర్థిని బరిలోకి దించడంతో నెంబర్ గేమ్ మొదలైంది.అసెంబ్లీలో తాజా బలాబలాల ప్రకారం ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థి గెలుపుకి కనీసం 35 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు క్లోజ్ కాంటెస్ట్ గా మారటంతో రాజకీయవర్గాలలో ఉత్కంఠ నెలకొంది.

గుజరాత్ పరిణామాలపై ఏఐసీసీ సీనియర్ నాయకుడు ‘ఈ పరిస్థితిని మేము ముందుగానే ఉంచామని, బిజెపి ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా అయితే రాజకీయ క్రీడలు ఆడుతున్నారో… అదే పనిని గుజరాత్‌లో కూడా వారు చేస్తున్నారని, పైగా గుజరాత్ బిజెపి పార్టీకి స్వస్థలమని’ వ్యాఖ్యానించాడు.అలాగే ప్రస్తుతం భారతదేశం అతి పెద్ద ఆరోగ్య, ఆర్ధిక మరియు మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ, రాజ్యసభ ఎన్నికలకు శాసనసభ్యులను వేటాడడంలో బిజెపి తన శక్తులన్నింటినీ ఉపయోగిస్తుందని గుజరాత్ ఏఐసీసీ ఇంచార్జ్ రాజీవ్ సతవ్ ట్వీట్ చేశారు.

ఏదేమైనప్పటికీ నాలుగు రాజ్యసభ స్థానాలలో రెండింటిని గెలుచుకోవాలనే ప్రణాళికతో ఉన్న కాంగ్రెస్ కు తాజా పరిణామాలు నిరాశ పరిచినట్లే భావించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి