iDreamPost

మున్సిపల్‌ ఎన్నికలు.. రేవంత్‌ రెడ్డికి మళ్లీ హ్యాండిచ్చారు

మున్సిపల్‌ ఎన్నికలు.. రేవంత్‌ రెడ్డికి మళ్లీ హ్యాండిచ్చారు

కాంగ్రెస్‌ పార్టీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఎదురుదెబ్బతగిలింది. కొడంగల్‌ మున్సిపాలిటీ ప్రజలు రేవంత్‌ రెడ్డికి మళ్లీ హ్యాండిచ్చారు. ఈ రోజు వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కొడంగల్‌ మున్సిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. 

మొత్తం 12 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 8 చోట్ల గెలుపొందగా కాంగ్రెస్‌ కేవలం మూడు చోట్లనే గెలుపొందింది. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటి తద్వారా పూర్వవైభవం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కానీ ఫలితాలు మాత్రం ఆయనకు నిరాశనే మిగిల్చాయి. 

2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. హరీష్‌రావుకు సిద్ధిపేట, కేసీఆర్‌కు గద్వేల్‌ ఎలాగో తనకు కూడా కొడంగల్‌ అలాంటిదని తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి రేవంత్‌ రెడ్డి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. కొద్ది రోజుల పాటు బయట ప్రపంచానికి కూడా రేవంత్‌ కనిపించలేదు.

అయితే 2019 లోక్‌ సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు. గెలుపుదక్కడంతో కొంత ఊరట చెందారు. అయితే తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఓటమిని రేవంత్, ఆయన అనుచరులు మరచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నించినా… విఫలం అవడంతో ఆయన అనుచరులు, అభిమానుల్లో నిరాశనెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి