iDreamPost

Tirumala: తిరుమల వెంకన్న ఆలయంలో అపశృతి! వాళ్లే కారణమా?

  • Author singhj Published - 03:10 PM, Thu - 6 July 23
  • Author singhj Published - 03:10 PM, Thu - 6 July 23
Tirumala: తిరుమల వెంకన్న ఆలయంలో అపశృతి! వాళ్లే కారణమా?

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తుంటారు. స్వామి దర్శనం కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చి సుదూరాల నుంచి వచ్చి తిరుమలకు చేరుకుంటారు భక్తులు. శ్రీవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక తన్మయత్వంలో మునిగిపోతారు. అయితే భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై కొన్నిసార్లు అపశృతి చోటుచేసుకోవడం గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు వెంకన్న భక్తులను ఎంతగానో బాధిస్తుంటాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో మరోమారు అపశృతి చోటుచేసుకుంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం దగ్గర ఒక హుండీ జారి కింద పడిపోయింది. వెంకన్న ఆలయం నుంచి హుండీలను పరకామణి మండపానికి తరలిస్తున్న సమయంలో మహాద్వారం దగ్గర ఓ హుండీ కింద పడింది. ఆ టైమ్​లో హుండీలో నుంచి కానుకలు కూడా కిందపడ్డాయి. అయితే వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ఆ కానుకలను జాగ్రత్తగా తిరిగి ట్రాలీలోకి ఎక్కించారు. అక్కడి నుంచి లారీలో హుండీని పరకామణి మండపానికి తరలించారు. ఈ ఘటనకు ఆలయ సిబ్బందే కారణం అని, వాళ్ల నిర్లక్ష్యం కారణంగానే హుండీ కింద పడిందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.

ఇక, శ్రీవారి ఆలయంలో ఉండే హుండీలు నిండిన తర్వాత వెలుపలికి తీసుకొచ్చి లారీలో నూతన పరకామణి మండపానికి తీసుకెళ్తారు. అలా హుండీలను పరకామణికి తీసుకెళ్లే క్రమంలో గుడి వెలుపల లారీలోకి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతోనే ఇలా జరిగినట్లు తెలిసింది. కాగా, ప్రతిరోజు శ్రీవారి హుండీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తుందనేది తెలిసిందే. ఈ హుండీలను వెంకన్న భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు అలాంటి ఒక హుండీ జారి కింద పడిపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే స్వామివారిని 77,299 మంది భక్తులు దర్శించుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి