iDreamPost

క్రేజీ సినిమాలకు ఇదో పెద్ద తలనెప్పి

క్రేజీ సినిమాలకు ఇదో పెద్ద తలనెప్పి

నిన్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ఉన్న తమ సినిమాలు పుష్ప, సర్కారు వారి పాట తాలూకు వీడియో లీకేజీల గురించి సీరియస్ గా ఒక నోట్ విడుదల చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని ప్రకటించింది. అప్పటికే సదరు క్లిప్పులు వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టేశాయి. ఇలా చేయడం ముమ్మాటికి తప్పే. ఎలా వ్యాప్తి చెందుతున్నాయి అనేది అనవసరం. అసలు ఇది ఎవరు మొదలుపెట్టారని కనిపెట్టాల్సిన బాధ్యత సదరు బ్యానర్ల మీదే ఉంటుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది నానుడి. కానీ ఇది వాస్తవంగా ఎన్నోసార్లు నిజ జీవితంలో ఇలాంటి సంఘటనల ద్వారా రుజువవుతూనే ఉంది.

ఈ బెడద ఇప్పటికిది కాదు. అత్తారింటికి దారేది రిలీజ్ కు ముందే కాపీ బయటికి వచ్చినప్పుడు పవన్ తో సహా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ అది చేసిన శక్తులేవో ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు. పోనీ పోలీసులు పట్టుకుని ఏదైనా కేసులు శిక్షలు వేశారా అంటే అదీ లేదు. బాహుబలి రిలీజు కు ముందే వర్కింగ్ వీడియోలు హల్చల్ చేశాయి. దానికి రాజమౌళి సైతం నిస్సహాయత వ్యక్తం చేయడం తప్ప ఏమి చేయలేకపోయారు. అంతదాకా ఎందుకు నిన్న ఉదయం ప్లాన్ చేసుకున్న భీమ్లా నాయక్ టీజర్ తాలూకు స్క్రీన్ షాట్లు మొన్న సాయంత్రమే ట్విట్టర్ తదితర ప్లాట్ ఫార్మ్స్ లో చక్కర్లు కొట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

టెక్నాలజీ పెరిగిపోయాక ఇలాంటివి కట్టడి చేయడం దుర్లభంగా మారుతోంది. చేతిలో చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎంతకైనా తెగబడే 4జి వరల్డ్ లో బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు కఠిన ఆంక్షలు అంత సులభం కాదు. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒంటి మీద ఒకే వస్త్రంతో పరిగెత్తే సీన్ సైతం గతంలో లీకవ్వడం ఎవరూ మర్చిపోలేదు. షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్లు బ్యాన్ చేస్తున్న నిర్మాతలు లేకపోలేదు. కానీ అది ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఇది ఎవరికి వారు బాధ్యతగా ఫీలవ్వాల్సిన దారుణం. తప్పు చేసినవాడిని పట్టుకోలేకపోయినా కనీసం ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నిర్మాతలదే

Also Read :  మల్టీ స్టారర్ కు మహా చిక్కు వచ్చిందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి