iDreamPost

Multi Starrer : మల్టీ స్టారర్ లు రావాలంటే జరగాల్సింది ఇది

Multi Starrer : మల్టీ స్టారర్ లు రావాలంటే జరగాల్సింది ఇది

పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా టాలీవుడ్ లో హీరోల మధ్య ఈగోల సమస్య ఉండటం వల్లే మల్టీ స్టారర్లు రావడం లేదన్నది వాస్తవం. స్టేజిల మీద ఎంత స్నేహంగా ఉన్నా అది తెరమీద రావడానికి ఉపయోగపడనప్పుడు అభిమానులు ఆశించే అద్భుతాలు ఎలా జరుగుతాయి. ఎన్టీఆర్-ఏఎన్ఆర్ లు కలిసి 14 సినిమాల్లో నటించడం ఇప్పటికీ రికార్డే. శోభన్ బాబు-కృష్ణ-కృష్ణంరాజు హయాం వరకు ఇలాంటివి బాగానే వచ్చాయి. కానీ చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ ల శకం మొదలయ్యాక వీళ్ళలో ఏ ఇద్దరూ కలిసి నటించే అవకాశాన్ని దొరకబుచ్చుకోలేదు. ఇది నెక్స్ట్ జెనరేషన్ కు కూడా కంటిన్యూ అయ్యింది. మహేష్ బాబు – ప్రభాస్ – పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ – రవితేజ (స్టార్ డం వచ్చాక)వీళ్ళెవరూ కంబైన్డ్ గా స్క్రీన్ ని షేర్ చేసుకుందామనే ఆలోచన చేయలేదు. ఇదంతా గతం.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలవడం, వాళ్ళ కెమిస్ట్రీ తెరమీద ఊహించిన దానికన్నా ఎక్కువగా పండటంతో ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆ బాండింగ్ కేవలం కెమెరా యాక్షన్ అనడం వల్ల వచ్చింది కాదు. ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా ఉన్న ఫ్రెండ్ షిప్ వల్లే సాధ్యమయ్యింది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఇద్దరూ ఇదే మాట అన్నారు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఎవరో ఒకరి ఇంట్లో కలిసి సమయం గడుపుతామని, అంత అనుబంధం ఉండటం వల్లే దర్శకుడి ఆలోచనలను తగ్గట్టు అవుట్ ఫుట్ ఇవ్వగలిగామని స్పష్టం చేశారు. రియల్ లైఫ్ బాండింగ్ నే తెరమీదా చూపించారన్న మాట.

మల్టీ స్టారర్ లు చేసేటప్పుడు అభిమానుల అంచనాలతో సమస్య వస్తుంది. నిజమే. గతంలో శోభన్ బాబు మహాసంగ్రామం, అశ్వమేథం, బలరామకృష్ణులు చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురుకున్నారు. కానీ బ్యాలన్స్ చేయగలిగే డైరెక్టర్ దొరకాలే కానీ అదేమంత పెద్ద విషయం కాదు. గుండమ్మ కథతో మొదలుపెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దాకా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో ఇవి చాలా సహజం. కానీ మన దగ్గరే ఏళ్ళ తరబడి ఈ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. చరణ్ తారక్ లది ఎంత డీప్ ఫ్రెండ్ షిప్పో నిన్న వేదిక మీద కెమెరాల సాక్షిగా కోట్లాది ప్రేక్షకులు చూశారు. సో ఇలాంటి బంధాలు టాలీవుడ్ కు మరిన్ని కావాలి. రిస్క్ తీసుకునే దర్శకులు నిర్మాతలు ముందుకు రావాలి. అప్పుడు ఒకటేమిటి వంద ఆర్ఆర్ఆర్ లు తీసుకోవచ్చు

Also Read : Pushpa, Pre Release Busines – ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ ‘తగ్గేదేలే’ అంటున్న ‘పుష్ప’ !

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి