Venkateswarlu
Venkateswarlu
దేశ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర భారత దేశం పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. భారీ వర్షాల కారణంగా అక్కడి జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ దాదాపు 8 రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 8 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీష్‌ఘడ్, గోవా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్‌తో పాటు తెలంగాణ కూడా ఉంది. అంతేకాదు! మరో వైపు తెలంగాణలో రాగల 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిపై వాతావరణ శాఖ సీనియర్ అధికారిణి లహరి మాట్లాడుతూ.. ‘‘ ఉత్తర జార్ఖండ్‌లో అల్పపీడనం ఏర్పడింది. ఆ అల్పపీడనం బలహీన పడి, ఉపరితల ఆవర్తనంగా మార్పు చెందింది. ఈ ఉపరితల ఆవర్తనం దక్షిణ జార్ఖండ్ ప్రాంతంనుంచి ఛత్తీష్‌ఘడ్ మీదగా ఉంది. ఇది దాదాపుగా 7.1 కిలోమీటర్ల ఎత్తుగా విస్తరించి ఉంది.
ఈ రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా.. తెలంగాణలో వచ్చే ఐదు రోజులు కూడా విస్తరంగా వర్షాలు కురుస్తాయి. రానున్న రోజులు కూడా వర్షాలు కురుస్తాయి. వచ్చే 24 గంటల్లో విస్తార వర్షాలతో పాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళా ఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఉత్తర, ఈశాన్య జిల్లాలతో పాటుగా.. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా భారీనుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అది ఎల్లుండినుంచి వచ్చే అవకాశం ఉంది’’ అని తెలిపారు. మరి, తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.