ఈటలకు మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించిన సీఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈటలను పార్టీ నుంచి కూడా సాగనంపేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఈటలకు కౌంటర్‌ ఇచ్చే సమయంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

హుజురాబాద్‌లో ఎవరిని నిలబెట్టినా గెలుస్తామని గంగుల కమలాకర్‌ వ్యాఖ్యానించారు. త్వరలో హుజురాబాద్‌లో పర్యటిస్తామని చెప్పారు. మళ్లీ తమ పార్టీ క్యాడర్‌ను తయారు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలతో.. ఈటలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేందుకు సిద్ధమయ్యారని అర్థమవుతోంది. ఇక అధికారికంగా ఆదేశాలు వెలువడడమే తరువాయి.. ఈటల టీఆర్‌ఎస్‌ మాజీ నేత కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈటలను వదులుకునేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌.. అదే సమయంలో రాజెందర్‌ బలాన్ని కూడా తక్కువ అంచనా వేయడం లేదని గంగుల కమలాకర్‌ వ్యాఖ్యలతో అర్థమవుతోంది. త్వరలో హుజురాబాద్‌లో పర్యటిస్తాం.. మళ్లీ మా పార్టీ క్యాడర్‌ను తయారు చేసుకుంటామని గంగుల అనడంతోనే.. టీఆర్‌ఎస్‌ క్యాడర్‌ అంతా ఈటల వైపు ఉన్నట్లు ఒప్పుకున్నారు. పార్టీ క్యాడర్, ద్వితియ శ్రేణి నేతలు అందరూ ఈటల వైపు ఉన్నారని ఇప్పటి వరకు జరిగిన పరిణామాల ద్వారా తెలుస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా దాన్ని తాజాగా నిర్థారించింది.

హుజురాబాద్‌లో ఎవరిని నిలబెట్టినా గెలుస్తామని మంత్రి గుంగుల కమలాకర్‌ అంటున్నారు. అంటే త్వరలో అక్కడ ఉప ఎన్నిక రాబోతోందనే సంకేతాలు ఇచ్చారు. పార్టీ గుర్తుతో గెలిచారు కాబట్టి రాజీనామా చేయాలంటే.. చేస్తానని ఇప్పటికే ఈటల రాజేందర్‌ కూడా ప్రకటించడంతో హుజురాబాద్‌లో ఓట్ల యుద్ధం తధ్యంలా కనిపిస్తోంది. ఇదే జరిగితే సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణలో హుజురాబాద్‌ నాలుగో ఉప ఎన్నిక అవుతుంది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామాతో హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, నాగార్జున సాగర్‌లలో ఎమ్మెల్యేల మృతితో ఉప ఎన్నికలు జరిగాయి.

Also Read : సీఎం లెక్క తప్పుతోందా..?

Show comments