వైఫల్యాలు మనిషిని కుంగదీస్తాయి.. అదే వరుసగా వైఫల్యాలు ఎదురయితే సదరు వ్యక్తి లేదా బృందం ఆత్మస్థైర్యం, విచక్షణలను కోల్పోవడం సహజం.. పేదల ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భూసమీకరణ చేయాలనే నిర్ణయంపై తెలుగుదేశం, దాని అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని చూస్తున్నవారికి …రాజకీయాలు మరీ ఇంత నీచ స్థాయికి దిగజారిపోయాయా… అనే భావన కలగక మానదు.
గూడొద్దా….
కూడు, గూడు, గుడ్డ…ఈ నినాదాన్ని పదే పదే గొప్పగా చెప్పుకొనే పార్టీ ఏదో తెలుగు రాష్ట్రల్లోని అందరికీ తెలిసిందే.. ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశంలోని చోటా మోటా నాయకుల వరకు దీన్నో తారకమంత్రంలా వల్లె వేశారు…కొంత మంది ఇప్పటికీ జపిస్తున్నారు. పేద వాడికి కూడు, గూడు, గుడ్డ అందించేందుకే అని గర్వంగా చెప్పుకొనే సదరు పార్టీ నేతలు ఇప్పుడెందుకు పేద ప్రజలకు గూడు దగ్గకుండా చేయాలని చూస్తున్నారు…? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి విశాఖలో 6వేల ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. దీనిపై టీడీపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తున్న సామాన్యులకు టీడీపీకి పేదల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే భావన కలుగుతోంది.
టీడీపీ నాయకులు పదే పదే పేదల అభ్యున్నతికే తమ పార్టీ పుట్టిందని చెప్తుంటారు. కానీ, సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ పేదలకు కూడు, గూడు, గుడ్డ వంటి మౌలిక సదుపాయాలను ఎందుకు అందించలేకపోయింది. అనేది ఓ అంతుచిక్కని ప్రశ్న.. టీడీపీయే గనుక సదరు లక్ష్యాలను సాధించి ఉండుంటే ప్రస్తుతం పేదల ఇళ్ల కోసం జగన్ భూమిని సేకరించాల్సిన పరిస్థితే ఉత్పన్నమయ్యేది కాదు… దీన్ని బట్టి చూస్తే టీడీపీతోపాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలోని పేదలకు ఇంటి వసతి కల్పించడంపై నిర్ణక్ష్యం వహించాయని స్పష్టమవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇందిరా గాంధీ కాలం తర్వాత వైఎస్సాఆర్ హయాంలోనే( రాజీవ్ గృహకల్ప) పేదలకు పెద్ద ఎత్తున ఇళ్లు దక్కాయనే విషయాన్ని ఒప్పుకోక తప్పదు.
రాజకీయపార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం సహజం.. కానీ, సదరు విమర్శలు ప్రజలను కించపరిచేలా ఉండకూడదు. ప్రస్తుతం తెలుగుదేశం, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం ప్రజలను కించపరిచేదిగా ఉంది. జగన్ ఏం చేసినా వివర్శించాలనే ఆత్రుతలో పేదల ఇళ్లపై విషం చిమ్మడం సమర్థనీయం కాదు. ఈ రకమైన చర్యలు వల్ల పార్టీ ప్రజల్లో అభాసుపాలవుతోంది. దీన్ని గుర్తించి వైఫాల్యాల వల్ల ఆవరించిన నైరాశ్యం మనుగడకే ఎసరు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలుగుదేశంపై ఉందని చెప్పకతప్పదు.
పేదల ఇళ్లకు సంబంధించిన భూసమీకరణపై ఎన్ని విమర్శలు చేస్తే టీడీపీకి అంత నష్టం జరుగుతుందని చెప్పకతప్పదు… బడాబాబులకు ఉపయోగపడేలా అమరావతిలో 33వేల ఎకరాలు సమీకరించడంపై ఇప్పటికే రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యవతిరేకత ఉంది.పేద ప్రజలకు ఇళ్లు కట్టేందుకు స్థలాలు లేవని సన్నాయి నొక్కులు నొక్కిన గత ప్రభుత్వ పెద్దలు. అమరావతి కోసం వేల ఎకరాలు సేకరించారు. దీంతో ప్రజల్లో టీడీపీ బడాబాబుల పార్టీ అనే ముద్రవేసుకుంది. దాని పర్యావసానమే పేద, మధ్యతరగతి ప్రజల్లో నిరాదరణకు గురై అధికారం కోల్పోవడం. కానీ, దాని స్థానంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల కోసం భూమిని సేకరిస్తుండటంతో కింది వర్గాల్లో ఆ పార్టీ గ్రాఫ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
టీడీపీ రోజు రోజుకీ ప్రజావ్యతిరేక విధానాలు, విమర్శలతో కాలం వెళ్లబుచ్చుతుంటే…జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదల కేంద్రంగా పరిపాలన సాగిస్తోంది. ఆ దిశగా అమ్మ ఒడి, గోరుముద్ద తదితర విప్లవాత్మక పథకాలతో పేదల ఇళ్లలోకి చొచ్చుకెళ్తోంది. ఇదే క్రమంలో జగన్ పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి సేకరించాలని నిర్ణయించడంతో ప్రతిక్షాలకు మింగుడుపడటం లేదు. కానీ, పట్టుదల, కార్యదీక్షతలు మెండుగా ఉన్న జగన్…భూమిని సమీకరించి ఇళ్లు నిర్మిస్తే పేదల గుండెల్లో నిలిచిపోవడం తథ్యం.